ఏపీ విద్యా రంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలి - సీఎం చంద్రబాబు
ఏపీ విద్యా రంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు.
రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల నాలెడ్జీ అద్భుతంగా ఉందని… త్వరలో వాళ్ల నుంచే తాను నేర్చుకునే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు.

విద్యా విధానం బాగుంది - సీఎం చంద్రబాబు
“ విద్యలో పిల్లల బలాబలాలు తెలుకునేందుకు... దానికి అనుగుణంగా విశ్లేషించుకుని స్కై, మౌంటెన్, స్టీమ్ అనే మూడు వర్గాలుగా వర్గీకరించారు. క్లిక్కర్ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోంది. నేను అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది. పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారు పరీక్షలు జరిగిన తర్వాత సమర్ధత తెలుసుకోవడం కాకుండా... ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా చేయడం బాగుంది” అని సీఎం చంద్రబాబు కితాబునిచ్చారు.
“మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిట్స్ వరకు నాణ్యత పెంచాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా, నాణ్యతతో అందిస్తున్నాం. స్టూడెంట్ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫొటోలు లేకుండా ఇస్తున్నాం. గతంలో విద్యార్థులకు చాలా యాప్ లు ఉండేవి... ఇప్పుడు అలాంటి ఇబ్బందులను తొలగించాం. శనివారం నో బ్యాగ్ డే... ఆడుతూ పాడుతూ విద్యార్ధులకు నచ్చిన పని చేస్తున్నారు 24 గంటలు రుద్దితే చదువు అబ్బదు.. ఇష్టంతో తక్కువ సమయం చదివినా రాణిస్తారు” అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నామన్నారు. ప్రపంచంలో లెర్నింగ్ విధానాలు అధ్యయనం చేస్తున్నారు... విదేశాలకు వెళ్లి పరిశీలిస్తున్నారని వివరించారు.
“మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని సమర్ధంగా ఎదుర్కొని ఏడాదిలోనే డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తి చేశాం. ట్రాన్సఫర్లను పారదర్శకంగా నిర్వహించాం. గతంలో టీచర్లను అవమానించారు... మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు. టీచర్లను గౌరవించే బాధ్యత మాది... పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే టీచర్లదే” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీని నెంబర్ 1 చేయాలి - సీఎం పిలుపు
“ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టీచరుకు 18 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ ప్రైవేట్ స్కూళ్లల్లో ఒక టీచరుకు 25 మంది పిల్లలు ఉన్నారు. ఇంతటి స్టాఫ్ ను ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చాం... ఏపీ విద్యా రంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలి. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది... మేం సరి చేస్తున్నాం. విద్యార్ధులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాం... పిల్లలు అదరగొట్టారు. స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నాం” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
“ఉన్నత, విదేశీ విద్య కోసం కలలకు రెక్కలు పేరిట పథకం ప్రారంభిస్తున్నాం. పావలా వడ్డీతో విదేశీ విద్యకు రుణాలిప్పిస్తాం.విద్యార్థుల కలలు, కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ పాటించాలి. పిల్లలకు అవసరమైన విద్యను అందిస్తాం... దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి” అని చంద్రబాబు సూచించారు.














