Palle Panduga 3.0 : గ్రామీణాభివృద్ధికి పల్లె పండుగ 3.0.. రూ.11085 కోట్ల పనులకు శ్రీకారం
పల్లె పండుగ 3.0 కింద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామాలలో రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులలో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంతోపాటు ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ మౌలిక వసతుల కల్పన, పల్లెల పురోగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ. 11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

కేంద్రం అండదండలతో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 'రూ. 11,085 కోట్ల నిధులతో చేపట్టే పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా మన పల్లెల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిక్షణం పరితపిస్తూ అనేక మార్పులు తీసుకువచ్చారు. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.' అని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో తాగునీటి సరఫరా, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, వీధిలైట్ల ఏర్పాటు ప్రాధాన్యతగా సాగుతోందన్నారు చంద్రబాబు. దుర్భర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఉదయగిరి ప్రాంతాన్ని పండ్లతోటల హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇక్కడి నుంచే గ్రామీణ నవోదయానికి నాంది పలికామని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ హామీలతోపాటు తల్లికి వందనం, స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాల ద్వారా మహిళలకు అండగా నిలిచామని చంద్రబాబు గుర్తుచేశారు. గ్రామాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, పాడి రైతులు, వ్యవసాయదారులకు మద్దతుగా నిలవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.
పల్లెపండుగలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త పంచాయతీ భవనాలు, గ్రామ బస్ షెల్టర్ల నిర్మాణం చేపడతారు. పాడి రైతుల ప్రయోజనార్థం మినీ గోకులాలు (పశువుల పాకలు), పశువుల తాగునీటి తొట్టెలు, పొలాల్లో పంట కుంటలు, మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు. వేలాది ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తారు.
ఈ కార్యక్రమం గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, రైతులకు, పాడి ఉత్పత్తిదారులకు మద్దతు ఇవ్వడం, గ్రామాల్లో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. పల్లె పండుగ 1.0 కింద పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించింది. 22,514 పశువుల షెడ్లు, 21,000 వ్యవసాయ చెరువులను నిర్మించింది. 64,000 ఎకరాల్లో ఉద్యానవన మొక్కలను నాటింది.
పల్లె పండుగ 2.0 కింద, 2,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 8,300 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 15,750 పశువుల షెడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 86,000 వ్యవసాయ చెరువులు, 82,000 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 32 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్‌ల పనులు చేపట్టారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


