జూరాల వద్ద తీవ్ర ఉద్రిక్తత - పోలీసుల పహారాలో ప్రాజెక్ట్, నీళ్ల కోసం రైతుల ఆందోళన

వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి ఎడమ కాలువ గేట్లను అధికారులు మూసివేయడంతో, ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు ఆందోళనకు దిగారు.

Published on: Sep 20, 2026, 12:25:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలువ కింద సాగు చేసిన పంటలు తీవ్రంగా ఎండిపోతుండటంతో…. నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయకట్టు రైతులు ఆందోళన బాట పట్టారు. పరిస్థితి చేయిదాటిపోకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు ప్రాజెక్టు ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు మొత్తం పోలీసుల కట్టుదిట్టమైన పహారాలోకి వెళ్లిపోయింది.

పోలీసుల పహారాలో జూరాల ప్రాజెక్టు
పోలీసుల పహారాలో జూరాల ప్రాజెక్టు

అసలేం జరిగింది?

ఎగువ నుంచి తగినంత నీటి ప్రవాహం లేక, తీవ్ర నిరీక్షణ మధ్య పంటలు ఎండిపోతుండటంతో ఆవేదన చెందిన ఆయకట్టు రైతులు శనివారం రోజు స్వయంగా ముందుకు వచ్చి జూరాల ఎడమ కాలువ గేట్లను ఎత్తారు. కాలువలోకి నీటిని విడుదల చేసుకుని తమ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే…. పరిస్థితులను గమనించిన నీటిపారుదల శాఖ అధికారులు అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఎడమ కాలువ గేట్లను తిరిగి బంద్ చేశారు. కాలువకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.

రైతుల ఆగ్రహం.. భారీ ధర్నా

ఉదయాన్నే కాలువలో నీటి ప్రవాహం నిలిచిపోవడాన్ని గమనించిన రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అధికారులు నీటి విడుదల నిలిపివేయడంతో ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకున్న రైతులు ధర్నాకు దిగారు. "నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో కళ్లముందే ఎండిపోతున్నాయి. తక్షణమే ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి మా పంటలను, మమ్మల్ని ఆదుకోవాలి," అని రైతులు కన్నీటిపర్యంతమవుతూ నినాదాలు చేశారు.

ప్రాజెక్టు వద్ద గట్టి పోలీసు భద్రత

రైతుల నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసు బలగాలను దించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఎడమ కాలువ గేట్ల వద్దకు ఎవరూ రాకుండా బలగాలు కాపలా కాస్తున్నాయి. అధికారులు మాత్రం నీటి లభ్యత, సాంకేతిక అంశాలను బట్టే కాలువలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. పంటలు ఎండిపోతున్న తరుణంలో నీరు అందకపోతే తమకు భారీ నష్టం తప్పదని ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి ఎలా వెళ్తున్నాయి..? కేటీఆర్

జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన…. జూరాలకు ఎగువ నుండి నీళ్లు లేవని.. కాలువకు నీటి విడుదల ఆపామని అధికారులు చెప్తున్నారని… కానీ ఏపీకి నీళ్ళు ఎలా పోతున్నాయని ప్రశ్నించారు.

“కర్ణాటక, ఏపీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రణాళికతో లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచే యోచనలో కర్ణాటక రాష్ట్రం ఉంది. దీంతో పాలమూరుకు భవిష్యత్తులో నీళ్ళు రావు. ఈ విషయం మీద పక్కనే ఉన్న కర్ణాటకను ఎందుకు నిలదీయట్లేదు కృష్ణా జలాల్లో పాలమూరు వాటా దక్కేవరకు ఊరుకోం” అని హెచ్చరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More