Krishna River : కృష్ణమ్మ పరవళ్లు - నిండుకుండలా జూరాల..! ఏపీ, తెలంగాణలో మొదలైన జలకళ!

ఎగువ నుంచి వస్తున్న వరదతో జూరాల జలాశయం నిండుకుండలా మారింది. నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల్లో నీటి పంపింగ్ ప్రారంభం కాగా…. జూరాలలో జలవిద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో షురూ చేసింది.

Published on: Jul 28, 2026, 09:51:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే జలకళను సంతరించుకుంటున్నాయి. కర్ణాటకలోని ఎగువ ప్రాజెక్టులైన ఆలమట్టి, నారాయణపూర్ నుంచి గత మూడు నాలుగు రోజులుగా క్రిందికి నీటిని విడుదల చేస్తుండటంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది.

జూరాల (ఫైల్ ఫొటో) (source X )
జూరాల (ఫైల్ ఫొటో) (source X )

జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా…. సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 8.63 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది.

జూరాల ప్రాజెక్ట్ వెనుకజలాల (బ్యాక్ వాటర్) ఆధారంగా నిర్మించిన వివిధ ఎత్తిపోతల పథకాల్లో పంపింగ్ ప్రక్రియను సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు ఆయా లిఫ్టుల ద్వారా నీటిని తోడుతున్నారు. ఇందులో జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయిల్ సాగర్ ఉన్నాయి.

కర్ణాటకలోని అల్మట్టి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 73,461 క్యూసెక్కుల వరద వస్తుండగా… అధికారులు దిగువకు 28,438 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా, దిగువకు 20,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

జూరాలలో జలవిద్యుత్ ఉత్పత్తి షురూ

ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో రాష్ట్రంలోనే తొలిసారిగా జలవిద్యుదుత్పత్తికి తెలంగాణ జెన్‌కో శ్రీకారం చుట్టింది. జూరాలకు వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. జూరాలలోని అప్పర్, లోయర్ జలవిద్యుత్ కేంద్రాల్లో ప్రాథమికంగా ఒక్కో యూనిట్‌లో ఉత్పత్తిని షురూ చేశారు. అప్పర్, లోయర్ పవర్ హౌస్‌లలో మొత్తం ఆరేసి యూనిట్ల చొప్పున విద్యుత్ కేంద్రాలు ఉండగా, అందులో మూడేసి యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపడటానికి నీటిపారుదల శాఖ జెన్‌కోకు అనుమతులు మంజూరు చేసింది.

మరోవైపు కృష్ణా ఉపనది అయిన తుంగభద్రపై కర్ణాటకలోని విజయనగర వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు 23,334 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ డ్యామ్ మొత్తం నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 32.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇవాళ్టి ఉదయం(జూలై 28,2026) రిపోర్ట్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ పరిధిలోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో 5,226 క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా… దిగువ సముద్రంలోకి 4,022 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More