మా వాటా రావాల్సిందే... లేదంటే జూరాల నుంచి నేరుగా నీటిని తరలిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఆపిన చరిత్ర తనది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమకు 90 టీఎంసీలు రావాల్సిందేనని లేదంటే జూరాల నుంచి రోజూ 2 టీఎంసీలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరొచ్చి అడ్డుకుంటారో చూస్తానంటూ అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడారు.

Published on: Jan 4, 2026, 06:50:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా వ్యూహాత్మకంగా కొట్లాడి ఒక స్పష్టమైన ఎత్తుగడ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రైతులు, నీటి హక్కులు, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మా చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అన్నారు.

శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి
శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి

జూరాల నుంచి నేరుగా తరలిస్తాం - సీఎం రేవంత్

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తొలి విడతగా 45 టీఎంసీలు, రెండో విడతగా 45 టీఎంసీలు అనుమతించాల్సిందేనన్నారు. లేదంటే జూరాల నుంచి నేరుగా నీటి తరలిస్తామని హెచ్చరించారు. ఏ సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కారం సాధించవచ్చని, వివాదాలపై పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా వివిధ హోదాల్లో కమిటీలను వేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు.

“నీళ్లు – నిజాలు” అన్న అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మొత్తం 490 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించిన 24 ప్రాజెక్టులు మంజూరైన వివరాలను గణాంకాలతో సహా వివరించారు.

“కృష్ణా జలాల్లో 490 టీఎంసీల నీరు తెలంగాణ హక్కు. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్‌లో అనేక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల పాటు పరిపాలించిన నాయకులు తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 490 టీఎంసీలు కేటాయిస్తే.. 299 టీఎంసీలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని అడిగానని చెబుతున్న విషయం కూడా వాస్తవం కాదన్నారు. రాష్ట్ర ఖర్చుతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రానికి లేఖ రాశారు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో వెల్లడించారు.

  • “కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశానికి రెండు సార్లు కేసీఆర్ వెళ్లారు. కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరించారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు దీనికే కట్టుబడి ఉంటామని సంతకం పెట్టారు. ఎప్పుడైతే ఆ వెసులుబాటు ఇచ్చారో దాన్ని ఆంధ్రప్రదేశ్ అవకాశంగా వినియోగించుకుంది.
  • నిజానికి గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు 2016 లోనే పునాది పడింది. గోదావరిలో మిగులు జలాలున్నాయని, వాడుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆ తప్పిదాన్ని సవరించుకోవడానికి 2020 లో బంగారం లాంటి అవకాశం వచ్చినా కేసీఆర్ ఎందుకనో ఉపయోగించుకోలేదు.
  • అంతర్జాతీయ జల వివాదాల పరిష్కారం మేరకు, పరీవాహక ప్రాంతానికి ముందు నీళ్లివ్వాలి. పరీవాహక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటే తెలంగాణలో 71 శాతం ఉంది. 811 టీఎంసీల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాలి. 1005 టీఎంసీల నీటి లభ్యత ఉందని ట్రిబ్యునల్ ప్రాతిపదికన తీసుకుంటే తెలంగాణకు 763 టీఎంసీలు రావాలి. ఈ లెక్కల మేరకు ప్రభుత్వం కొట్లాడుతుంటే ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ అపోహలు సృష్టిస్తున్నారు. 2014 వరకు రాయలసీమకు 4.47 టీఎంసీల నీటిని తరలిస్తుండగా…. 2014 తర్వాత నుంచి 13.12 టీఎంసీలు తరలిస్తున్నారంటే ఇది గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందించిన బహుమానం.
  • PRLIS సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చాలని ఎవరూ చెప్పలేదు. 3 లిఫ్టులు, 22 పంపులతో పూర్తి చేయాల్సిన దాన్ని శ్రీశైలంకు మార్చి లిఫ్టుల సంఖ్యను 5 కు, పంపులను 37 కు పెంచారు. జూరాల నుంచి సోర్సుగా ప్రారంభిస్తే ప్రతి దశలోనూ నీటి పారుదల ప్రాంతాన్ని స్పష్టంగా నిర్దేశించారు. కానీ శ్రీశైలం నుంచి సోర్సుగా ఎంపిక చేసిన పథకంలో 19 పంపుల వరకూ నీటి వాడకం నిల్. పైగా 2022 వరకు ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేయలేదు. 55,800 కోట్లకు అంచనాలను పెంచారు.
  • 32,200 కోట్లతో ప్రారంభమైన పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడు కట్టాలంటే 1 లక్ష కోట్లకు చేరుకునే పరిస్థితి. ఏడు సంవత్సరాల పాటు ఎలాంటి అంచనాలు లేకుండానే కాంట్రాక్టర్లకు 20 వేల కోట్లు ఖర్చు చేశారు.జూరాల నుంచి శ్రీశైలంకు సోర్సును మార్చినా అది సాగునీటి ప్రాజెక్టు కాదని, కేవలం 7.15 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టు మాత్రమేనని ఎన్జీటీ, సుప్రీంకోర్టుల్లో అఫిడవిట్ దాఖలు చేశారు. పంపులకు, లిఫ్టులకు బిల్లుకు చెల్లించాలన్న ఆలోచనతో తాగునీటి కోసం అలా చేశారు.
  • 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని.. రూ. 55 వేల కోట్ల అంచనాలు చూపించి.. చివరకు అది సాగునీటి ప్రాజెక్టే కాదు. తాగునీటి ప్రాజెక్టని పేర్కొన్నారు. పై గా 45 టీఎంసీలకు ఎలా ఒప్పుకున్నారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
  • 70 టీఎంసీలకు గాను జురాల వద్ద ప్రాజెక్ట్ కట్టడానికి.. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఏ ప్రాజెక్ట్ ను ఆపడానికి వీల్లేదు. జూరాల దగ్గర 70 టీఎంసీల వరద జలాలతో 2013 ప్రతిపాదిత ప్రాజెక్టుల చేపట్టుకోవచ్చని చట్టబద్ధత కల్పించబడింది” అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

“నాకు నా ప్రాంతమే ముఖ్యం. ఆ తర్వాత పార్టీ. ఆ తర్వాత నాయకుడు. సీఎం కుర్చీలో ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా ప్రవర్తించను. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించిన చరిత్ర నాది. ఆ ప్రాజెక్టు పనులను ఆపితేనే చర్చలకు వస్తామని చెప్పిన చరిత్ర మాది" అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

"ఆ ప్రాజెక్టు పనులు ఆపారో లేదో నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయించుకోవచ్చు. చచ్చినా.. బతికినా.. తెలంగాణ కోసమే. చీమునెత్తురున్న వారు తెలంగాణ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెడతారా?. తెలంగాణ హక్కులను ఎవరు భంగం కలిగించినా నిటారుగా నిలబడి కొట్లాడుతా. పాలమూరు కట్టి తీరుతామని కంకణం కట్టుకుని బయలుదేరితే విమర్శలు చేస్తారా” అంటూ ప్రశ్నించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More