...
...
Next Story

Dhavaleswaram Barrage : ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ - రూ.153 కోట్లతో 117 కొత్త గేట్లు, పనులకు శ్రీకారం

Dhavaleswaram Barrage Gates : ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152.95 కోట్లతో 117 కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Published on: Jul 13, 2026, 19:26:17 IST
Advertisement

Dhavaleswaram Barrage Gates : గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంట్లో భాగంగానే సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లను అమరుస్తున్నట్టు చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లను అమర్చే పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.

వచ్చే ఏడాది జూన్ వరకు గడువు….

ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్లు - పనులకు సీఎం శ్రీకారం
ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్లు - పనులకు సీఎం శ్రీకారం

ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్తగేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు గేట్లను అమర్చే పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళ్తోందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోందని అధికారులు వివరించారు. అలాగే కాల్వలకు ఎన్ని క్యూసెక్కులు విడుదల చేశారని ముఖ్యమంత్రి అడిగారు. 14,700 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదిలామని అధికారులు చెప్పారు. కాల్వ చివరి భూములకూ నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు.

అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని పిచ్చుకలంకలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోదావరి డెల్టాకు దేశానికే అన్నపూర్ణ అనే ఖ్యాతి రావడానికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టే కారణమని, అనంతరం ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన కొత్త బ్యారేజీతో మరో పంటకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. 2.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 32.2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యంతో పాటు ఈస్ట్రన్, సెంట్రల్, వెస్ట్రన్ డెల్టాల్లో కలిపి 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా బ్యారేజీ ఉపయోగపడుతోందన్నారు.

ఒకప్పుడు కోనసీమలో వరికి మద్దతు ధర లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెలకొంటే, ఇప్పుడు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు విక్రయించిన 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని సీఎం విమర్శించారు. 2014-19 మధ్య 72 శాతం పనులు పూర్తిచేయగా, ఆ తర్వాత ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు మాత్రమే జరిగాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగవంతమై ప్రస్తుతం 89 శాతం పురోగతి సాధించామని తెలిపారు.

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పుష్కర ఘాట్ల అభివృద్ధితో పాటు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.1,200 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. పిచ్చుకలంక, బొబ్బర్లంక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, కోనసీమకు రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని… ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని… సామాజిక భద్రత పెన్షన్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై రాజీపడబోమని సీఎం హెచ్చరించారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. గంజాయిని ప్రోత్సహించే వారిపైనా, మహిళలను కించపరిచే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks