శాంతి భద్రతలకంటే ఏదీ ముఖ్యం కాదు, ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్ - సీఎం చంద్రబాబు
మంగళగిరి 6వ బెటాలియన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలకంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై అరాచకం చేస్తే అత్యంత కఠినంగా ఉండాలన్నారు.
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని… ప్రభుత్వం పోలీసులకు అండగా ఉంటుందని చెప్పారు. ఇవాళ మంగళగిరి 6వ బెటాలియన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పించారు.

మీరు చేసేది నిస్వార్థ సేవ - సీఎం చంద్రబాబు
ఈ సంవత్సరం విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. “మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు..మీరు చేసేది నిస్వార్థ సేవ. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటాను. పెట్టుబడులు పెడితే ఇబ్బంది ఉండదన్న నమ్మకం ఉంది కాబట్టే గూగుల్ సంస్థ వచ్చింది. ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం ను అణిచివేయడంలో మీరు ఎంతో పేరు తెచ్చుకున్నారు” అని ప్రశంసించారు.
“నేరాల తీరు మారుతోంది క్రిమినల్స్ అప్ డేట్ అవుతున్నారు. మరి వారి ఆటకట్టించాలంటే మీరు మరింత అప్ డేటెడ్ వెర్షన్ తో ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నాం.టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది.అప్పుడు ఎటువంటి నేరస్తుడిని అయినా పట్టుకోవచ్చు.ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డెడ్‌గా పట్టుకోవచ్చు. అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్రచందనం దొంగలను కట్టడి చేస్తున్నారు. పోలీస్ అంటే సమర్థవంతంగా ఉండాలి...పోలీస్ అంటే భయం ఉండాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి” అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
“నేరాల కట్టడి విషయంలో సీరియస్సుగా ఉండాలి.. లేకుంటే నేరాలు ఎక్కువ అవుతాయి. శాంతి భద్రతల విషయంలో నేను ఏనాడూ రాజీపడలేదు. అందుకే నాపై నక్సలైట్లు క్లైమైర్ మైన్లతో దాడి చేశారు. ఓ దొంగ, ఓ డెకాయిట్ ఏదోక ప్రాంతానికే పరిమితమవుతారు. కానీ రాజకీయ ముసుగులో చేసే నేరాలతో సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో పోలీసులు మరింత అలెర్టుగా ఉండాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
సోషల్ మీడియా అనేది పోలీసులకు అతి పెద్ద ఛాలెంజ్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యనించారు. “ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు.. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టుల విషయంలో చాలా మంది కుమిలిపోతున్నారు. శాంతి భద్రతలకంటే ఏదీ ముఖ్యం కాదు. ఆడబిడ్డలపై అరాచకం చేస్తే.. అదే చివరి రోజు అనిపించేలా పోలీసులు కఠినంగా ఉండాలి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మరింత బలోపేతం చేస్తాం - సీఎం చంద్రబాబు
“వైద్యసేవలకు పోలీసులకు 16 నెలల్లో రూ.33 కోట్లు విడుదల చేశాం. మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద రూ.23 కోట్లు అందించాం. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. ఒక డీఎ ఇవ్వాలని నిర్ణయించాం. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ డబ్బును రెండు విడతల్లో చెల్లిస్తున్నాం. శాఖాపరమైన పదోన్నతులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

