ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు సపోర్ట్ చేయండి.. నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వాలని, హార్టీకల్చర్ హబ్‌కు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Published on: Jul 18, 2026, 06:12:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. రొయ్యల మేతకు వినియోగించే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగటం ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కారణంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. ృ

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు

రొయ్యల మేత

రొయ్యల మేతకు సంబంధించి ముడిపదార్థాల భారం టన్నుకు రూ.25 వేల వరకూ పెరిగినట్టు సీఎం కేంద్రమంత్రికి వివరించారు. రొయ్యలు, ఆక్వాకల్చర్ ఉత్పత్తులకు సంబంధించి దేశీయ మార్కెట్ ను ప్రోత్సహించటం, ఎఫ్‌పీఓల ఏర్పాటు, మార్కెట్‌తో ఆక్వా రైతుల అనుసంధానం, దేశీయ మార్కెట్లలో బ్రాండింగ్, ప్రాసెసింగ్, రీటైల్ ధరల ఏకీకరణకు మద్దతు ఇవ్వటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ హెచ్చుతగ్గుల నుంచి ఈ రంగానికి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. దీని కోసం ఓ సంస్థాగత ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రోడ్యూసర్స్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్ఎఫ్ డీబీ ద్వారా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

సుంకాలను తగ్గించాలి

రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను తగ్గించేలా కేంద్రం సంప్రదింపులు జరపాలని సీఎం అభ్యర్థించారు. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యలపై 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీని అమెరికా విధించిందని అలాగే యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా వేసేందుకు ఆలోచన చేస్తోందని సీఎం తెలిపారు. అమెరికా అధ్యక్షుడి రెసిప్రోకల్ టారిఫ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం అన్నారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో 80 శాతం ఏపీ నుంచే వెళ్తున్నాయని, రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తే రాష్ట్రంలోని 30 లక్షల మంది ఆక్వా కల్చర్ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధి దెబ్బ తినే ప్రమాదం ఉందన్నారు. అమెరికాకు చేసే రొయ్య ఎగుమతులను కాపాడేందుకు సీఫుడ్‌పై ప్రస్తుతం ఉన్న 30 శాతం కస్టమ్స్ సుంకాన్ని సున్నాకు తగ్గించాలని లేదా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దానిని మినహాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కు కేంద్రం నుంచి పూర్తి సహకారం అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం స్పష్టం చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి సహా ప్రకాశం, మార్కాపురం జిల్లాలు ఉద్యాన ఉత్పత్తిలో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయని సీఎం వివరించారు. 2030 నాటికి సాగు విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచటంతో పాటు ఉద్యాన ఉత్పత్తులను 435 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ప్రతిపాదించామని సీఎం కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఐఎస్ఏ‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఆవిష్కరణల్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఇది పనిచేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఏఐ, డిజిటల్ అగ్రికల్చర్, వాతావరణ సుస్థిరత లాంటి అంశాలపై దృష్టి్ సారించేలా ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఫార్మింగ్, పోస్ట్-హార్వెస్ట్ సిస్టమ్స్, గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేలా ఐఎస్ఐ పనిచేస్తుందన్నారు చంద్రబాబు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, అగ్రిటెక్ లాంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఈ సంస్థ కీలకంగా పనిచేస్తుందని సీఎం తెలిపారు. రిలయన్స్ గ్రూప్ యాంకర్ భాగస్వామిగా స్టార్టప్, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. జాన్ డీర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా, నెస్లే, కార్గిల్ లాంటి అంతర్జాతీయ కంపెనీల నుంచి పరిశోధనా సహకారాన్ని కూడా తీసుకోనున్నట్టు సీఎం తెలిపారు. ఎంబీఏ అగ్రికల్చర్ లీడర్షిప్, డిజిటల్ అగ్రికల్చర్ లో మాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ లాంటి ప్రపంచ స్థాయి కోర్సులను అందించేలా దీనిని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటులో తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More