Donald Trump : ‘2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం.. బీజింగ్ చేతిలో 22కోట్ల ఓటర్ల డేటా’
Trump China : అమెరికా ఎన్నికల వ్యవస్థను టార్గెట్ చేస్తూ చైనా భారీ కుట్రకు పాల్పడిందని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా 22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల డేటాను బీజింగ్ చోరీ చేసిందని ఆయన ఆరోపించారు.
అమెరికా రాజకీయాల్లో మరోసారి ఎన్నికల అక్రమాల రగడ రాజుకుంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో తాను ఓడిపోవడానికి ఓట్ల దొంగతనమే కారణమంటూ మొదటి నుంచి వాదిస్తున్న ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. తాజాగా చైనా లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా ఎన్నికల వ్యవస్థలోని "షాకింగ్ లోపాల"కు సంబంధించిన అత్యంత రహస్య నిఘా సమాచారాన్ని (ఇంటెలిజెన్స్ డేటా) తాను బహిర్గతం చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ప్రస్తుత ఓటింగ్ విధానంలో సమూల మార్పులు చేయకపోతే.. రాబోయే యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి వైట్‌హౌస్ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. ఈ వ్యవహారంపై సంచలన విషయాలను పంచుకున్నారు.
"2020 ఎన్నికల సమయం నుంచే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మన దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా చోరీకి పాల్పడింది. ఇందులో భాగంగా ఏకంగా 220 మిలియన్ల (22 కోట్ల మంది) అమెరికన్ ఓటర్ల వ్యక్తిగత ఫైళ్లను చైనా అక్రమంగా చేజిక్కించుకుంది," అని ట్రంప్ ఆరోపించారు.
అంతేకాదు, అమెరికా ప్రభుత్వ యంత్రాంగంలోని కొందరు కీలక అధికారులు (డీప్ స్టేట్) చైనా చేసిన ఈ డేటా మోసాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ట్రంప్ మండిపడ్డారు. ఈ స్థాయి డేటా లీకేజీ అనేది అమెరికా ఎన్నికల భద్రతకు ఒక ఊహించని పీడకల లాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత అమెరికా ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా, ఖచ్చితత్వంతో సాగడానికి ఏమాత్రం సరిపోవడం లేదని విమర్శించారు.
"ప్రతి అమెరికన్ తాను వేసే ఓటు ఖచ్చితంగా లెక్కిస్తారన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎన్నికల వ్యవస్థలో మోసాలు, బయటి వ్యక్తుల జోక్యానికి అస్సలు అవకాశం ఉండకూడదు. కానీ, దురదృష్టవశాత్తూ నేడు మనకున్న వ్యవస్థ ఆ ప్రమాణాలకు చాలా దూరంలో ఉంది," అని ట్రంప్ పేర్కొన్నారు.
నిజంగానే చైనా ఓటర్ల డేటాను సేకరించిందా?
అమెరికా ఓటర్ల డేటాను బీజింగ్ సేకరిస్తోందనే ఆరోపణలు కొత్తవేమీ కావు. సైబర్ భద్రతకు సంబంధించిన నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 2020లో ఇచ్చిన నివేదిక (ఇది 2022లో పాక్షికంగా బహిర్గతమైంది) ప్రకారం.. చైనా నిఘా అధికారులు అమెరికాలోని పలు రాష్ట్రాల ఓటర్ల రిజిస్ట్రేషన్ డేటాను విశ్లేషించి, అక్కడ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేదానిపై రీసెర్చ్ చేసినట్లు తేలింది.
అయితే, 2020 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్- ఆయనకు చెందిన మద్దతుదారులు దాఖలు చేసిన 60కి పైగా కేసుల్లో ఎక్కడా మోసం జరిగినట్లు కోర్టులు ధృవీకరించలేదు! పైగా ఓట్ల లెక్కింపులు, ఆడిట్‌లు, స్వయంగా ట్రంప్ హయాంలోని న్యాయ శాఖ కూడా ఎన్నికల ఫలితాలను మార్చే స్థాయి అక్రమాలు ఏవీ జరగలేదని స్పష్టం చేయడం గమనార్హం.
క్రాష్ అయిన వైట్‌హౌస్ వెబ్‌సైట్..
ఎన్నికల భద్రతకు సంబంధించిన డీక్లాసిఫైడ్ (రహస్య నియంత్రణ లేని) పత్రాలను విడుదల చేస్తున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే వైట్‌హౌస్ అధికారిక వెబ్‌సైట్ (WhiteHouse.gov) గురువారం రాత్రి డౌన్ అయింది. సాంకేతిక సమస్యల కారణంగా యూజర్లకు “టూ మెనీ రిక్వెస్ట్స్” అనే ఎర్రర్ మెసేజ్ చూపించింది.
2020 ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందనే తన ఆరోపణలకు మద్దతుగా ట్రంప్ యంత్రాంగం డజన్ల కొద్దీ రహస్య పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించింది. చైనా తమ ఓటర్ల డేటాను ఎలా దొంగిలించింది, అలాగే అమెరికా ఓటింగ్ మిషన్లలో ఉన్న లోపాలు ఏంటి అనే అంశాలు ఆ పత్రాల్లో ఉన్నాయి. ఈ పత్రాలను చూడటానికి లక్షలాది మంది నెటిజన్లు ఒకేసారి వెబ్‌సైట్‌ను సందర్శించడంతో ట్రాఫిక్ పెరిగి సైట్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ నెటిజన్లు పేర్కొన్నారు.
కాగా, ఆ తర్వాత కొద్దిసేపటికే వెబ్‌సైట్‌ని మళ్లీ పునరుద్ధరించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


