తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ కార్యాచరణ వేగవంతం చేయాలి : సీఎం రేవంత్

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి 100 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి మళ్లించే ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.

Updated on: Apr 30, 2026, 05:44:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేంనరేందర్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తుమ్మిడిహెట్టిని ఎంత ఎత్తున నిర్మించాలి.. ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందని సమావేశంలో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొన్ని ప్రాంతాల్లో కాల్వల నిర్మాణం కూడా జరిగిందన్నారు. 71.5 కి.మీ మేరకు కెనాల్ వర్క్ జరిగిందని అధికారులు వివరించారు.

150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలన్నిటిని సద్వినియోగం చేసుకునేందుకు 150 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించాలని నిపుణులు సూచించారు.

గతెలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు అంగీకరించిందని, 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందని మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు వెల్లడించారు.

ఈ బ్యారేజీ నిర్మాణం చేపడితే ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలో మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగు నీటిని అందించవచ్చని, అలాగే తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు వీలుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రాజెక్ట్ ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాల్సిన అవసరం ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కిషన్ రెడ్డికి తెలంగాణ రైతుల తరఫున కూడా విజ్ఞప్తి చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిసి చర్చించాలని కూడా అన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వానలు పడేలోపు పనులు పూర్తి చేయాలని మరోసారి స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More