...
...
Next Story

పంటల బీమా పరిహారం త్వరగా ఇవ్వాలి.. కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు

కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. పంటల బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Published on: Nov 4, 2026, 21:02:45 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల అంచనా కోసం రాష్ట్రంలో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం(ఐఎంసీటీ) ముఖ్యమంత్రిని కలిసింది.

కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు
కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు

ఈనెల 2, 3 తేదీల్లో రెండు బృందాలుగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటించిన సభ్యులు తమ కరువు అధ్యయన వివరాలు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని తీర ప్రాంతం తుఫాన్ల సమస్యతో ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో కారణంగా రాయలసీమ సహా ఇంకొన్ని ప్రాంతాలు తీవ్ర కరవుతో అల్లాడుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ బృందానికి వివరించారు.

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, రైతుల సమస్యలు, ప్రభుత్వం చేపడుతున్న ఉపశమన చర్యలపై స్పష్టత లభించిందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో 412 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించామని, రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారం రోజుల్లో కరువు పరిస్థితులపై కేంద్రానికి నివేదిక కూడా సమర్పిస్తామని సీఎం చెప్పారు.

ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే ప్రకృతి వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో వీబీ జీ రామ్ జీ పథకం కింద కనీస పనిదినాలను 200 రోజులకు పెంచి, వ్యవసాయ రంగానికి అవసరమైన పనులకు ఈ పథకాన్ని వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కేంద్ర బృందాన్ని కోరారు. దీంతో రైతులకు మానవ వనరుల సమస్య తీరడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు. అనేక ప్రాంతాల్లో అదనంగా బోర్లు వేసినా ఆశించిన ఫలితం ఉండటం లేదని వివరించారు. అందువల్ల తాత్కాలిక నీటి సరఫరా చర్యలతో పాటు శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకాన్ని మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయడం, అనుసంధానించడం వంటి సమర్ధ నీటి నిర్వహణ పనులకు కేంద్రం సహకరించాలని కోరారు. కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు.

పంటల బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరితగతిన రైతుల ఖాతాల్లో పరిహారం జమయ్యేలా కేంద్రం చొరవ తీసుకోవాలని సీఎం కోరారు. రైతులకు సకాలంలో పరిహారం అందితే తదుపరి పంటల సాగుకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని వివరించారు. కరువు ప్రభావం వ్యవసాయానికే పరిమితం కాకుండా పశుసంపద, గ్రామీణ జీవనోపాధిపై కూడా పడుతున్నందున పశుగ్రాసం, తాగునీటి సరఫరా వంటి అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను, రైతుల సమస్యలను పరిశీలించింది. రైతులతో నేరుగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహాయంపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే, మరోవైపు కోస్తాంధ్ర జిల్లాల్లో తుపాను కారణంగా పంటలు, ఇతర రంగాలకు నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విభిన్న ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా స్పందించి తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks