గంటకు 5 కి.మీ వేగంతో అక్వాన్ తుపాను.. నరసాపురం - పూరీ మధ్య తీరం దాటే అవకాశం
Cyclone Akvan Update : బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతోంది. గడచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదిలినట్టుగా ఐఎండీ తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను అక్వాన్(Cyclone Akvan) తీరం వైపు దూసుకొస్తోంది. గంటగంటకు తన మార్గాన్ని మార్చుకుంటూ ముందుకు సాగుతున్న ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు హైఅలర్ట్ ప్రకటించారు. నవంబర్ 20 (శుక్రవారం) మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం - ఒడిశాలోని పూరీ మధ్య ఇది తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్‌లో వెల్లడించింది.

గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదిలిన అక్వాన్ తుపాను, ప్రస్తుతం నరసాపురానికి 470 కి.మీ, కళింగపట్నానికి 490 కి.మీ, చెన్నైకి 570 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కి.మీ., గరిష్ఠంగా 110 నుండి 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తొలుత ఈ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి మచిలీపట్నం లేదా బాపట్ల వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత నరసాపురం-కాకినాడ వైపు, తాజాగా ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా వైపు దీని గమనం మారింది. అయితే తీరం దాటే సమయానికి ఇది మరింత బలహీనపడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాతావరణంలో మధ్యస్థాయి తేమ తక్కువగా ఉండటమే దీనికి కారణం.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. పార్వతీపురం మన్యం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం సహాయక బృందాలను మోహరించింది. శ్రీకాకుళం, టెక్కలి, పలాసలలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, సీతంపేటలలో రెండు బృందాలను, విజయనగరంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC) అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం తీసుకున్న చర్యలను జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ వెల్లడించారు.
24/7 నగరవ్యాప్తంగా 11 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్స్ సెంటర్ మూడు షిఫ్టులలో పనిచేస్తుంది. ప్రజలు తమ ఫిర్యాదులు లేదా సహాయం కోసం 180042500009 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా 9014218870 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చు. నగరంలో ముంపునకు గురయ్యే 55 లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను తరలించేందుకు 55 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
చెట్లు విరిగిపడినా, నీరు నిలిచినా వెంటనే తొలగించేందుకు 30 జేసీబీలు, 70 టిప్పర్లు, 30 మినీ ఎక్స్‌కవేటర్లు, 10 ఆయిల్ ఇంజన్లను సిద్ధంగా ఉంచారు. మధురవాడ, ఈస్ట్, సౌత్, నార్త్, వెస్ట్, గాజువాక, పెందుర్తి ప్రాంతాల్లో 15 ప్రత్యేక ఉద్యానవన బృందాలను మోహరించారు. నగరంలోని 98 వార్డులకు గాను ఒక్కో వార్డుకు 15 మంది సిబ్బందితో ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.
ప్రమాదకరంగా ఉన్న 8 విద్యుత్ స్తంభాలను గుర్తించి ఏపీఈపీడీసీఎల్ అధికారులతో కలిసి మరమ్మతులు చేపడుతున్నారు. రెవెన్యూ, అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేసుకుంటూ, ఆటోల ద్వారా మైకులలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


