శబరిమల స్పెషల్ ట్రైన్స్.. శ్రీకాకుళం, మచిలీపట్నం, కాకినాడ నుంచి కొల్లాం వరకు

Sabarimala Special Trains : శబరిమల భక్తులకు దక్షిణ కోస్తా రైల్వే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కొల్లాం వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.

Published on: Nov 13, 2026, 10:42:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తీక మాసం, మండల-మకరవిళక్కు పూజల సందర్భంగా కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే(South Coast Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, మచిలీపట్నం, కాకినాడ ప్రాంతాల నుండి కేరళలోని కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్ల రాకపోకల పూర్తి వివరాలు, సమయాలు కింది విధంగా ఉన్నాయి.

శబరిమల స్పెషల్ ట్రైన్
శబరిమల స్పెషల్ ట్రైన్

శ్రీకాకుళం రోడ్ – కొల్లాం

ఉత్తరాంధ్ర భక్తుల సౌకర్యార్థం నవంబర్ 22 నుండి జనవరి చివరి వరకు ఈ వీక్లీ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. రైలు నంబర్ 08539 (శ్రీకాకుళం రోడ్ - కొల్లాం) నవంబర్ 22, 2026 నుండి జనవరి 24, 2027 వరకు ప్రతి ఆదివారం ఉదయం 09:20 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం) రాత్రి 09:30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

రైలు నంబర్ 08540 (కొల్లాం - శ్రీకాకుళం రోడ్) నవంబర్ 24, 2026 నుండి జనవరి 26, 2027 వరకు ప్రతి మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు కొల్లాంలో బయలుదేరి, మరుసటి రోజు (బుధవారం) సాయంత్రం 04:50 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.

మచిలీపట్నం – కొల్లాం

కృష్ణా జిల్లా, పరిసర ప్రాంతాల అయ్యప్ప స్వాముల కోసం రెండు ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. రైలు నంబర్ 07231 (మచిలీపట్నం - కొల్లాం) నవంబర్ 20, నవంబర్ 27, 2026 (శుక్రవారాలు) తేదీలలో సాయంత్రం 04:30 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు (శనివారం) రాత్రి 09:30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

రైలు నంబర్ 07232 (కొల్లాం - మచిలీపట్నం) నవంబర్ 22, నవంబర్ 29, 2026 (ఆదివారాలు) తేదీలలో తెల్లవారుజామున 02:30 గంటలకు కొల్లాంలో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం) ఉదయం 08:50 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

కాకినాడ టౌన్ – కొల్లాం

ఉమ్మడి గోదావరి జిల్లాల భక్తుల కోసం మొత్తం 10 ట్రిప్పుల చొప్పున ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. రైలు నంబర్ 07233 (కాకినాడ టౌన్ - కొల్లాం) నవంబర్ 19, 2026 నుండి జనవరి 21, 2027 వరకు ప్రతి గురువారం ఉదయం 08:20 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు (శుక్రవారం) రాత్రి 09:30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

రైలు నంబర్ 07234 (కొల్లాం - కాకినాడ టౌన్) నవంబర్ 21, 2026 నుండి జనవరి 23, 2027 వరకు ప్రతి శనివారం తెల్లవారుజామున 02:30 గంటలకు కొల్లాంలో బయలుదేరి, మరుసటి రోజు (ఆదివారం) సాయంత్రం 06:30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

శబరిమల సీజన్‌లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున, భక్తులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కొల్లాం రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత కేరళ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ద్వారా నేరుగా పంబ బేస్ క్యాంప్‌కు చేరుకునే సదుపాయం అందుబాటులో ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More