రేపటికి ‘అక్వాన్’ తుపాను అతి తీవ్రరూపం.. కోస్తాకు అతి భారీ వర్షాల ముప్పు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘అక్వాన్’ తుపాను క్రమంగా బలపడుతోంది. నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుపానుగా మారి, 20న నెల్లూరు-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Published on: Nov 18, 2026, 06:33:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ (Akvan) తుపాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను కలవరపెడుతోంది. మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఈ తుపాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న మంగళవారం వెల్లడించారు.

విశాఖ తీరం ఒడ్డున నిలిచిపోయిన మత్స్యకారుల బోట్లు (PTI)
విశాఖ తీరం ఒడ్డున నిలిచిపోయిన మత్స్యకారుల బోట్లు (PTI)

నవంబర్ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు సాధారణంగా ఏపీ తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ప్రస్తుతం అక్వాన్ తుపాను కదలికలు మందకొడిగా ఉండటంతో, సముద్రంలోనే మరింత శక్తిని పుంజుకుని బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల యంత్రాంగం, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

క్రమంగా అతి తీవ్ర తుపానుగా..

తుపాను ప్రస్తుత స్థితిగతులను కె. నాగరత్న ఏఎన్ఐ వార్తా సంస్థకు వివరిస్తూ కీలక విషయాలు చెప్పారు. "అక్వాన్ తుపాను మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటలుగా గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతూ 12.2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 85.7 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కొనసాగుతోంది. నవంబర్ 18 ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా బలపడుతుంది. ఆ తర్వాత నవంబర్ 19 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది" అని నాగరత్న పేర్కొన్నారు.

తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కురవబోయే వర్షాల తీరుపైనా ఆమె స్పష్టత ఇచ్చారు. "కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడొచ్చు. ఐఎండీ జారీ చేసే హెచ్చరికలకు అనుగుణంగా సముద్రంలో, తీర ప్రాంతాల్లో కార్యకలాపాలను సమీక్షించుకోవాలి" అని నాగరత్న సూచించారు.

ఎక్కడ కేంద్రీకృతమై ఉందంటే..

నవంబర్ 17 మధ్యాహ్నం 2:30 గంటల (ఐఎస్‌టీ) పరిశీలనల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారిక వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం, తుపాను 12.3 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 85.6 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది చెన్నైకి తూర్పున సుమారు 590 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలీకి ఈశాన్యంగా 630 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడుతుందని, అనంతరం వాయవ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 19 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని అంచనా వాతావరణ శాఖ వేసింది.

నెల్లూరు - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం

వాయవ్య దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ నవంబర్ 20 మధ్యాహ్నం సమయంలో అక్వాన్ తుపాను తీరం దాటనుంది. నెల్లూరు, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను అతి తీవ్ర తుపానుగా ఇది తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగానికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ మెసేజ్’ కింద తుపాను హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More