అక్వాన్ తుపాను.. తీరాన్ని దాటే ప్రక్రియ.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన!

అక్వాన్ తుపాను తీరాన్ని దాటే ప్రక్రియ నడుస్తోంది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated on: Nov 20, 2026, 09:20:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్‌ తుపాను(Cyclone Akvan) తీరాన్ని దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ(IMD) అధికారికంగా ప్రకటించింది. రానున్న 3 లేదా 4 గంటల్లో ఇది పూర్తిగా తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. గత 6 గంటలుగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను, ఒడిశాలోని గోపాల్‌పూర్‌ సమీపంలో తీరాన్ని తాకనుంది.

అక్వాన్ తుపాను
అక్వాన్ తుపాను

వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. తీవ్ర తుపానుగా ఉన్న అక్వాన్‌ తీరానికి చేరువయ్యే క్రమంలో కాస్త బలహీనపడి తుపానుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి తూర్పుగా సుమారు 80 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం, గోపాల్‌పూర్‌లలోని డాప్లర్ వెదర్ రాడార్ల ద్వారా వాతావరణ శాఖ తుపాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గరిష్టంగా 90 కి.మీ వేగానికి చేరుకునే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో సోంపేట తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి.

గడచిన కొన్ని గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్ఛాపురం-16.0 సెం.మీ, కంచిలి-10.0 సెం.మీ, కవిటి-10.0 సెం.మీ, పలాస 9.9-సెం.మీ, సోంపేట-9.2 సెం.మీ, వజ్రపుకొత్తూరు-4.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తుపాను గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటనుండటంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల నుండి సుమారు 3 లక్షల మందిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్, అగ్నిమాపక దళాలతో కలిపి 423 సహాయక బృందాలను రంగంలోకి దించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More