బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తీవ్ర తుఫాన్…. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతానికి ఈ తుపాను చెన్నైకి 570 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 590 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 580 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్….. ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం - పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తీర ప్రాంతాలకు హెచ్చరికలు…
తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పి. పుల్లారెడ్డి సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్న సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా విద్యుత్ సమస్యలు తలెత్తినా, తీగలు తెగిపడినా వెంటనే సంబంధిత జిల్లాల కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
జిల్లాల వారీగా APCPDCL కంట్రోల్ రూమ్ నంబర్లు :
- కృష్ణా: 6281709355
- ఎన్టీఆర్: 9440817561
- గుంటూరు: 9440817526
- బాపట్ల: 9281413774
- ప్రకాశం: 9440817491
- పల్నాడు: 7382623148
- మార్కాపురం: 7780420711
- సీఆర్డీఏ (CRDA): 8331092947