...
...
Next Story

ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్ - 28న తీరం దాటే అవకాశం..! 140 కి.మీ. వేగంతో ఈదురుగాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తీవ్ర తుఫానుగా మారి అక్టోబర్ 28న బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటనుంది. ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు… అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశాయి.

Published on: Oct 26, 2026, 08:37:58 IST
Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను గడిచిన ఆరు గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది మరింత బలపడి 'అతి తీవ్ర తుఫాను'గా రూపాంతరం చెంది…. అక్టోబర్ 28 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశముందని స్పష్టం చేసింది.

తీరం దాటే సమయంలో తీవ్ర ఈదురుగాలులు

'అర్నబ్' తుఫాను
'అర్నబ్' తుఫాను

అక్టోబర్ 28 ఉదయానికి ఈ తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుని ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపిస్తుంది. "అక్టోబర్ 28న మధ్యాహ్నంలోగా బాపట్ల - విశాఖపట్నం మధ్య (యానాం తీరంతో కలిపి) అతి తీవ్ర తుఫాను రూపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది," అని ఐఎమ్‌డీ భువనేశ్వర్ కేంద్రం వెల్లడించింది.

అక్టోబర్ 25 రాత్రి 11 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం….. తీవ్ర వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలింది. అక్టోబర్ 25 రాత్రి 11:30 గంటల సమయానికి ఇది శ్రీ విజయ పురానికి (అండమాన్ దీవులు) ఉత్తర-వాయువ్యంగా 520 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 730 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 920 కిలోమీటర్లు, బాపట్లకు తూర్పుగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు వివరించారు.

ఈ తుఫాన్ ప్రారంభంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పటికీ, అక్టోబర్ 27 (మంగళవారం) నాటికి గాలి వేగం గంటకు 100 నుంచి 125 కిలోమీటర్లకు పెరిగి ‘అతి తీవ్ర తుఫాను’గా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత ఉత్తర దిశగా పయనించే క్రమంలో గాలుల వేగం కొంత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో మెకనైజ్డ్ బోట్ల మత్స్యకారులందరూ సురక్షితంగా తీరంలోనే ఉండిపోయారు.

మరోవైపు ఒడిశా రాష్ట్రం కూడా ‘అర్నబ్’ ప్రభావం నుంచి తట్టుకునేందుకు తీవ్ర సన్నాహాలు చేస్తోంది. తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించినట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. తీరం దాటే సమయానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వివిధ శాఖలకు స్పష్టమైన బాధ్యతలను కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks