Arnab cyclone update : అర్నబ్ తుపాను.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అక్టోబర్ 27 నాటికి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. అక్టోబర్ 28న బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముండటంతో ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు వర్ష సూచనలను ఇచ్చింది. ఆ వివరాలు..
బంగాళాఖాతంలో మళ్లీ కల్లోలం మొదలైంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర రూపం దాల్చుతోంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనిస్తూ అక్టోబర్ 26 నాటికి తుపానుగా, అక్టోబర్ 27 నాటికి ‘తీవ్ర తుపాను’గా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

అర్నబ్ తుపాను నేపథ్యంలో తీరప్రాంత ప్రజలను, మత్స్యకారులను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోంది.
అర్నబ్ తుపాను- ఏపీలో ఎక్కడ, ఎప్పుడు తీరం దాటనుంది?
ఐఎండీ నివేదిక ప్రకారం.. ఈ అర్నబ్ తుపాను తీవ్ర రూపం దాల్చిన తర్వాత అక్టోబర్ 28న బాపట్ల - విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ - యానాం తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో తీరం వెంట గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గాలి వేగం పెరిగినప్పుడు గంటకు 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
తుపాను తీరం దాటే సమయంలో సముద్రం విపరీతమైన అల్లోకల్లోలంగా మారనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29 వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని సముద్రంలో ఉన్నవారు వెంటనే వెనక్కి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీకి ఉన్న 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం, 12 తీరప్రాంత జిల్లాల్లో అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు.
జిల్లాల వారీగా వర్షపాత హెచ్చరికలు..
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, యానాం: అక్టోబర్ 26 నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 27, 28 తేదీల్లో అనేక చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాయలసీమ: అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి.
ఒడిశా ప్రభావం: ఏపీకి ఆనుకుని ఉన్న ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలకు ఐఎండీ 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే డజాస్టర్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించింది.
అర్నబ్ తుపాను- ఇతర రాష్ట్రాల పరిస్థితి..
బంగాళాఖాత వ్యవస్థ ప్రభావంతో కేరళ, తమిళనాడులలో కూడా వర్షాలు పడనున్నాయి. కేరళలోని ఇడుక్కి, పలక్కాడ్ జిల్లాలకు అక్టోబర్ 26న రెడ్ అలర్ట్ జారీ కాగా, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్ తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
తమిళనాడులోని పుదుక్కోటై, శివగంగ, రామనాథపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
కాగా ఈ వాతావరణ వ్యవస్థ వల్ల బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా స్వల్ప నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
అర్నబ్ తుపాను నేపథ్యంలో సముద్ర తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అధికారిక సూచనలను పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


