మెుంథా తుపాను ఎఫెక్ట్.. ఒక్కో కుటుంబానికి రూ.3వేల ఆర్థిక సాయం : సీఎం చంద్రబాబు

మెుంథా తుపాను పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Updated on: Oct 27, 2025, 18:18:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌వైపు వేగంగా దూసుకొస్తుంది. దీంతో రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను పరిస్థితిపై సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.

మెుంథా తుపాను పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష
మెుంథా తుపాను పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష

అంతేకాదు పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు.

‘రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుపాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నాం. సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాసం కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టాం.’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, విరిగిపడ్డ చెట్లను తొలగించేలా యంత్రాలతో బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

తుపాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారన్నారు. మొంథా తుపాన్ ప్రస్తుతం కాకినాడ వైపు దూసుకొస్తుంది. ఈ ప్రభావంతో ఈరోజు, రేపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఇక తీర ప్రాంతాల్లో పరిస్థితి గంటగంటకు మారుతుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటనుంది ముంథా. తుపాను ప్రభావంతో తీరం వెంట ఈదురుగాలుల తీవ్రత పెరుగుతూ ఉంది. పలు తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మెుంథా తుపాను ప్రభావం ముదలై విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు జలాశయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More