...
...
Next Story

Cyclone Murasu : మురసు తుపానుతో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్!

Cyclone Murasu : ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుపాను ప్రభావం కొనసాగుతోంది. భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Published on: Nov 3, 2026, 19:14:42 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మురసు తుపాను ప్రభావం కొనసాగుతుండటంతో భారత వాతావరణ శాఖ తీర ప్రాంతాల్లో ఆకస్మిక వరదల (flash floods) హెచ్చరికలను జారీ చేసింది. ఈ తుపాను మధ్యాహ్నానికల్లా బలహీనపడి సాధారణ తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, మధ్యాహ్నం 3 గంటల సమయానికి కూడా అది బలహీనపడలేదు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 95-105 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.

తుపానుతో ఆకస్మిక వరదలు (Facebook)
తుపానుతో ఆకస్మిక వరదలు (Facebook)

బాపట్ల, గుంటూరు, కృష్ణ, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో సముద్రపు నీరు పోటెత్తడం వల్ల ఈ జిల్లాల్లో మోడరెట్ స్థాయిలో వరద ముప్పు పొంచి ఉంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత జిల్లా అయిన బాపట్లలో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవంబర్ 2, 3 తేదీల మధ్య రాత్రి సమయంలో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయానికి ప్రకాశం జిల్లాలో వర్షం తీవ్రత తగ్గినా.. బాపట్ల జిల్లాలో మాత్రం 150 మిల్లీమీటర్లకు పైగా భారీ వర్షపాతం నమోదవుతూనే ఉంది.

మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య బాపట్ల జిల్లాలోని కోనంకిలో 182.25 మి.మీ, అదే జిల్లాలోని మార్టూరులో 174.75 మి.మీ, పల్నాడు జిల్లాలోని ఎడ్లపాడులో 147.45 మి.మీ, చిలకలూరిపేటలో 147.13 మి.మీ వర్షపాతం నమోదైంది. పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణ, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ భారీ వర్షాలు ఉన్నాయి.

ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం ప్రాంతాల సమీపంలో, ఒంగోలు వద్ద ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన ఈ తుపాను, ఆ తర్వాత ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతూ మధ్యాహ్నం 1 గంట వరకు ప్రయాణించింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి వాతావరణ నిపుణుల పరిశీలన ప్రకారం, ఈ తుపాను ఒంగోలుకు ఉత్తర-ఈశాన్యంగా సుమారు 30 కి.మీ, బాపట్లకు నైరుతి దిశలో 40 కి.మీ, కావలికి ఉత్తర-ఈశాన్యంగా 90 కి.మీ, విజయవాడకు దక్షిణ-నైరుతి దిశలో 100 కి.మీ, మచిలీపట్నానికి పశ్చిమ-నైరుతి దిశలో 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

మంగళవారం నాడు రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీ రాజ్, పోలీసు, ఇతర శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కాళిదిండి, ఏలూరు అర్బన్, దెందులూరు, నిడమర్రు, మండవల్లి, ముదినేపల్లి, మరికొన్ని మండలాల్లో వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు.

తుపాను విధుల్లో ఉన్న అధికారులను ఉద్దేశించి మాట్లాడిన కలెక్టర్ వెట్రి సెల్వి.. ప్రమాదకర ప్రాంతాల్లో, పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పాఠశాల భవనాల పరిస్థితి, విద్యుత్ సరఫరాపై నివేదికలు సమర్పించాలని కోరారు. అలాగే విద్యుత్ తీగలను వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కొవ్వాడ, తమ్మిలేరు, జల్లేరు, ఎర్రకాలువలో నీటి మట్టాలను నిశితంగా పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు.

ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా హోర్డింగ్‌ల కింద ఆశ్రయం పొందవద్దని కలెక్టర్ హెచ్చరించారు. వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(SDRF) బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయని అధికారులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks