బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది మరింత తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని, నవంబర్ 2న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రకటించింది.

ఇటీవలే అక్టోబర్ 28న తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ఉభయ రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టం నుంచి తీర ప్రాంత ప్రజలు ఇంకా కోలుకోకముందే…. మరో తుఫాన్ రూపంలో ముప్పు పొంచి ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ రాబోయే తుఫాన్ దాడి చేసే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో గాలుల వేగం గంటకు 100 కిలోమీటర్లకు కూడా చేరవచ్చని ఐఎమ్‌డీ అంచనా వేస్తోంది. సోమవారం సాయంత్రానికి ఇది ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే సూచనలు కనిపిస్తోంది.
ఐఎండీ వివరాల ప్రకారం…. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి, ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి, మధ్యపశ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా రూపాంతరం చెందుతుంది. నవంబర్ 2 సాయంత్ర నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని మధ్యపశ్చిమ బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు….
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం…. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.
{{/usCountry}}ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం…. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.
{{/usCountry}}ఇవాళ కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు, తక్కువ ఎత్తులో నివసించే వారు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు ఇవాళ(ఆదివారం) సాయంత్రం నుంచి ఏపీ తీరం వెంబడి గాలుల తీవ్రత గణనీయంగా పెరగనుంది. తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా తీరానికి తిరిగి రావాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించింది.