Weather Update : ఆంధ్రప్రదేశ్ వెదర్ అలర్ట్.. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు!
IMD Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 24 గంటలు పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాగల 24 గంటల్లో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తీరప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. విశాఖ, విజయనగరంలతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా అప్రమత్తత అవసరమని అధికారులు తెలిపారు:
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులు పడే ముప్పుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే మూడు రోజులు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
'వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలి. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం వేళల్లో పిడుగులు పడొచ్చు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.' అని అధికారులు సూచించారు.
విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో కొన్ని చోట్లు పిడుగులతో పడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
వర్షం పడుతున్న సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదు. ఈదురుగాలుల ధాటికి హోర్డింగులు, పురాతన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి. సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉన్నందున చిన్న పడవలు, బోట్లతో వేటకు వెళ్లే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
తీరప్రాంత ప్రజలు స్థానిక అధికార యంత్రాంగం ఇచ్చే మార్గదర్శకాలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో విపత్తు నిర్వహణ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. మరోవైపు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో అత్యధికంగా 66.7 మి.మీ, పెంజెరువులో 42.5 మి.మీ, సోమలింగపాలెంలో 40 మి.మీ మేర వర్షపాతం రికార్డయింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


