అర్నబ్ తుఫాన్ తో రూ.4764 కోట్ల మేర నష్టం - కేంద్ర బృందానికి నివేదిక
AP Cyclone Damage Assessment : అర్నబ్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీకి కేంద్ర బృందం చేరింది. కేంద్రం నుంచి తగినంత సాయం అందేలా కృషి చేస్తామని రాష్ట్ర అధికారులకు తెలిపింది.
AP Cyclone Damage Assessment : అర్నబ్ తుఫాన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వ పరిశీలనా బృంధం రాష్ట్రానికి వచ్చింది. ఇందులో భాగంగా శనివారం ఈ బృందం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించింది. అర్నబ్ తుపాన్ వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయిక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ అధికారులు తుఫాన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందస్తు సన్నద్దత చర్యల గురించి కేంద్ర బృందానికి వివరించారు.
ప్రాణనష్టం తగ్గించగలిగాం…..
అర్నబ్ గురించి ఆరు రోజుల ముందు నుంచే ప్రజలను నిరంతరం అప్రమత్తం చేశామని… ఆర్టీజీఎస్ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) నుంచి ప్రజలకు నిరంతరం తుఫాన్ హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు.
“7.23 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు నిరంతరం తుపాన్‌కు సంబంధించి హెచ్చరికలు జారీ చేశాం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రజలు ఎవ్వరూ కూడా తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేయడంతో పాటు రహదారులపై వాహనాల రాకపోకలను నిలిపేశాం, తద్వారా ప్రాణ నష్టం పెద్దగా వాటిల్లకుండా చేయగలిగాం. తుపాన్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వివిధశాఖల మధ్య సమన్వయంతో పనిచేసేలా ఆర్టీజీఎస్ నుంచి పర్యవేక్షించాం” అని కేంద్ర బృందానికి వివరించారు.
రూ.4,764 కోట్ల నష్టం….
అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రంలో రూ.4,764 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. 4.63 లక్షల మంది రైతులకు చెందిన 3.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 23,383 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 2,491 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రధాన రహదార్లు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. 7,382 ఇళ్లు దెబ్బతిన్నాయి. 12 జిల్లాల్లో తుపాన్ వల్ల నష్టం వాటిల్లిందని అయితే కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. విద్యుత్తు రంగానికి భారీగా నష్టం వాటిల్లిందన్నారు.
ఆర్టీజీఎస్ ప్రెజెంటేషన్ పట్ల పూర్తిగా సంతృప్తి చెందిన కేంద్ర బృందం…. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత ఆర్థిక సాయం త్వరగా అందేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపింది. తక్షణ సహాయక నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని చెప్పింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

