ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ - సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది నవంబర్ 2న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది మరింత తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని, నవంబర్ 2న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రకటించింది.

ఇటీవలే అక్టోబర్ 28న తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ఉభయ రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టం నుంచి తీర ప్రాంత ప్రజలు ఇంకా కోలుకోకముందే…. మరో తుఫాన్ రూపంలో ముప్పు పొంచి ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ రాబోయే తుఫాన్ దాడి చేసే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో గాలుల వేగం గంటకు 100 కిలోమీటర్లకు కూడా చేరవచ్చని ఐఎమ్‌డీ అంచనా వేస్తోంది. సోమవారం సాయంత్రానికి ఇది ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే సూచనలు కనిపిస్తోంది.
ఐఎండీ వివరాల ప్రకారం…. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి, ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి, మధ్యపశ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా రూపాంతరం చెందుతుంది. నవంబర్ 2 సాయంత్ర నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని మధ్యపశ్చిమ బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు….
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం…. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.
ఇవాళ కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు, తక్కువ ఎత్తులో నివసించే వారు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు ఇవాళ(ఆదివారం) సాయంత్రం నుంచి ఏపీ తీరం వెంబడి గాలుల తీవ్రత గణనీయంగా పెరగనుంది. తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా తీరానికి తిరిగి రావాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

