తిరుమల శ్రీవారికి ప్రతిరోజూ ఎన్ని రకాల నైవేద్యాలు పెడుతారో తెలుసా..?

Tirumala Srivari Naivedyam Details : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి రోజువారీ కైంకర్యాల్లో భాగంగా వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారం నిత్యం 45 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయ పోటు విశేషాలు, దివ్య ప్రసాదాల ప్రాచీన పేర్ల వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి…

Published on: Sep 11, 2026, 16:09:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారు అత్యంత నైవేద్య ప్రియుడు. ఏడుకొండలపైన నిత్యోత్సవం, వారోత్సవాలతో అలరారే శ్రీవారి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజూ వివిధ రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు, రుచికరమైన పణ్యారాలను అత్యంత శాస్త్రోక్తంగా నివేదిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జరిగే పూజా కైంకర్యాలకు అనుగుణంగా ఆయా సమయాల్లో ప్రత్యేకమైన ప్రసాదాలను సమర్పించడం యుగాలుగా వస్తున్న పవిత్ర ఆనవాయితీ.

నిత్యం శ్రీవారికి 45 ప్రసాదముల నివేదన (image source TTD)
నిత్యం శ్రీవారికి 45 ప్రసాదముల నివేదన (image source TTD)

తిరుమల ఆలయంలో నైవేద్యాల తయారీ అంతా ప్రాచీన వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారం అత్యంత పవిత్రతతో జరుగుతుంది. ఆలయంలోని అత్యంత పావనమైన 'పోటు' (వంటశాల)లో అర్చకులు, పోటు సిబ్బంది మడిచారాలతో ఈ ప్రసాదాలను సిద్ధం చేస్తారు. నైవేద్య తయారీలో ఉపయోగించే పదార్థాలు, పాత్రలు, వంట చేసే విధానాలకు ఆగమ శాస్త్రంలో విశిష్ట ప్రాధాన్యం ఉంది.

శ్రీవారి నైవేద్యాల తయారీలో ఉన్న ఒక ప్రధానమైన విశేషం ఏమిటంటే…. ఎక్కడా ఎండుమిర్చి గానీ, పచ్చిమిర్చి గానీ ఉపయోగించరు. దానికి బదులుగా కేవలం నల్లమిరియాలను మాత్రమే కారానికి, రుచికి ప్రామాణికంగా వినియోగిస్తారు. ఇది యుగయుగాలుగా వస్తున్న ప్రాచీన నియమం.

ప్రాచీన పేర్లు

మనం నిత్యం పిలుచుకునే సాధారణ పేర్లకు, వైఖానస పరిభాషలోని ఆగమ నామాలకు ఎంతో వ్యత్యాసం ఉంది.

  • పులిహోరను ‘తింత్రిణీరసాన్నం’ అని పిలుస్తారు.
  • నెయ్యి పొంగలిని ‘ముద్గాన్నం’ అని వ్యవహరిస్తారు.
  • బెల్లం అన్నం / చక్ర పొంగలిని ‘గుడాన్నం’ అని అంటారు.
  • మిరియాల అన్నాన్ని ‘మరీచ్యాన్నం’ అని పిలుస్తారు.
  • తిరుమల ప్రసిద్ధ వడను ‘మాషాపూపం’ అని అంటారు.
  • దోశను ‘చక్రప్పం’ అని వ్యవహరిస్తారు.

నిత్యం 45 రకాల ప్రసాదాలు….

శ్రీవారికి అనునిత్యం మొత్తం 45 రకాల దివ్య ప్రసాదాలను నివేదిస్తారు. వీటిలో 20 రకాల అన్న ప్రసాద నైవేద్యాలు కాగా, మిగిలిన 25 రకాలు పిండివంటలు మరియు పణ్యారములు కావడం గమనార్హం.

  1. మొదటి గంట అనంతరం (ఉదయపు నైవేద్యం): ఆలయంలో ఉదయం మొదటి గంట మోగిన తర్వాత స్వామివారికి మాత్రాన్నం, ముద్గాన్నం (నెయ్యి పొంగలి), తింత్రిణీరసాన్నం (పులిహోర), దధ్యోదనం (పెరుగన్నం), గుడాన్నం (బెల్లం అన్నం), శాకాన్నం (కదంబం), శర్కరాన్నం (రవ్వకేసరి) సమర్పిస్తారు. వీటితో పాటు నిత్యం నాలుగు రకాల పణ్యారాలైన లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), గుడప్పం (అప్పం), చక్రప్పం (దోశ) నివేదిస్తారు.
  2. రెండో గంట అనంతరం (రాజభోగం / మధ్యాహ్న నైవేద్యం): మధ్యాహ్న కాలంలో రెండో గంట మోగిన పిమ్మట రాజభోగ కైంకర్యం జరుగుతుంది. ఈ సమయంలో శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గుడాన్నం, దధ్యోదనం, శీరా లేదా శక్కరభాత్ వంటి నైవేద్యాలను ఆరగింపుగా సమర్పిస్తారు.
  3. మూడో గంట అనంతరం (శయనభోగం / రాత్రి నైవేద్యం): రాత్రి వేళ మూడో గంట మోగిన తర్వాత శయనభోగం నిర్వహిస్తారు. ఈ సమయంలో మరీచ్యాన్నం (మిరియాల అన్నం), చక్రప్పం (దోశ), లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), శర్కరాన్నం మొదలైనవాటిని నివేదిస్తారు.

సాయంకాల ఆరాధన – ఏకాంత సేవా వైభవం

సాయంత్రం గర్భాలయాన్ని శుభ్రపరిచి, స్వామివారిని నూతన దివ్య పుష్పాలతో అలంకరించిన తర్వాత ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తారు. శయనభోగం అనంతరం అర్ధరాత్రి సమయంలో స్వామివారికి ‘తిరువీసం’ అనే పవిత్ర నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇందులో తెల్ల అన్నంతో పాటు బెల్లంతో చేసిన రుచికరమైన గుడాన్నం ఉంటుంది.

రోజులో చివరి ఘట్టంగా జరిగే ఏకాంత సేవలో శ్రీనివాసుడికి వెచ్చని పాలు, కాలానికి అనుగుణంగా లభించే పండ్ల ముక్కలు, ప్యూర్ నెయ్యిలో వేయించిన ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటి ఎండు ఫలాలను నివేదించి పవళింపు సేవ పూర్తి చేస్తారు. వైఖానస ఆగమ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ నైవేద్య సేవలు తిరుమల క్షేత్ర మహత్యానికి, సనాతన వైదిక వైభవానికి నిలువెత్తు నిదర్శనం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More