తిరుమల హుండీ ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డు... ఒక్కరోజే రూ. 6.93 కోట్లు!

Tirumala Hundi : తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ కానుకలు లభించాయి. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వచ్చిన హుండీ కానుకలను గురువారం లెక్కించగా.. రూ.6.93 కోట్లుగా తేలింది.

Published on: Sep 11, 2026, 05:51:49 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం చరిత్రలోనే అరుదైన ఘట్టం నమోదైంది. శ్రీవారి హుండీ కానుకల రూపంలో ఏకంగా రూ. 6.93 కోట్ల ఆదాయం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలోనే ఒక్క రోజులో ఇంత భారీ మొత్తంలో కానుకలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఆరు కోట్లకుపైగా మూడుసార్లు వచ్చాయి.

శ్రీవారి హుండీకి భారీ ఆదాయం (gemini ai)
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం (gemini ai)

బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా ఈ రికార్డు స్థాయి ఆదాయం తేలింది. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారిపై ఉన్న అపార భక్తితో భారీ మొత్తంలో హుండీ కానుకలు సమర్పించడమే చారిత్రాత్మక రికార్డుకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.

జులై 26, 2012న శ్రీవారి హుండీకి రూ. 5.73 కోట్ల ఆదాయం రాగా, ఆ తర్వాతి కాలంలో ఏప్రిల్ 2018 లో ఒకేరోజు రూ. 6.28 కోట్లు లభించి రికార్డు సృష్టించింది. మార్చి 2022లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 6.18 కోట్లుగా నమోదైంది. ఇప్పుడు లభించిన రూ. 6.93 కోట్లతో కలిపి టీటీడీ చరిత్రలో ఒక్క రోజులో రూ. 6 కోట్లకు పైగా హుండీ కానుకలు రావడం ఇది మూడోసారి.

సాధారణ రోజుల్లో శ్రీవారికి ప్రతిరోజూ సగటున రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుంటుంది. అయితే పండుగలు, ప్రత్యేక ఉత్సవాలు, అజ్ఞాత భక్తులు సమర్పించే భారీ విరాళాల సమయంలో ఈ ఆదాయం కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

వరుస సెలవుల వస్తుండటంతో కొండపైకి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13వ తేదీ ఆదివారం రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నాడు ఎటువంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఆదివారం రోజు రద్దు చేసిన వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని పూర్తిగా సామాన్య భక్తులకే కేటాయిస్తారు. దీంతో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది సామాన్య భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం భాగ్యం కలుగుతుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి.. టీటీడీ యాజమాన్యానికి సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 12వ తేదీ శనివారం నుంచి 14వ తేదీ సోమవారం వరకు వరుసగా సెలవులు రానున్నాయి. దీనితో వీకెండ్ కలసి రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రానున్న రెండు, మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More