మన్యం ప్రజలకు బిగ్ రిలీఫ్ - రంగంలోకి 'కుంకీ' ఏనుగులు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బెడదకు చెక్ పెట్టేందుకు అటవీశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ముసలమడుగు శిబిరం నుంచి జయంత్, అభిమన్యు అనే రెండు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను తరలిస్తోంది.

Published on: Jul 22, 2026, 13:34:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగుల బెడదపై ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో… అటవీ శాఖ అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. జిల్లా వాసులకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో, పలమనేరులోని ముసలమడుగు క్యాంపు నుంచి రెండు ప్రత్యేక కుంకీ ఏనుగులను మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించనున్నారు.

'కుంకీ' ఏనుగులు!
'కుంకీ' ఏనుగులు!

రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో సుదీర్ఘకాలం ప్రత్యేక శిక్షణ పొందిన 'జయంత్' అనే కుంకీ ఏనుగుతో పాటు, కర్ణాటక నుంచి తీసుకువచ్చిన 'అభిమన్యు' అనే మరో కుంకీని మన్యం జిల్లాకు పంపాలని ఉప ముఖ్యమంత్రి అటవీ అధికారులను ఆదేశించారు. మానవ-ఏనుగుల మధ్య జరిగే సంఘర్షణలను సమర్థవంతంగా అరికట్టడంలో ఈ రెండూ అత్యంత అనుభవం కలిగినవిగా పేరుగాంచాయి.

ఇటీవల కాలంలో అభిమన్యు, జయంత్‌లు అత్యంత సంక్లిష్టమైన ఆరు మేజర్ ఆపరేషన్లలో భాగస్వామ్యమై వాటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాయి. ముఖ్యంగా ఇటీవల పలమనేరు సమీపంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఒంటరి మగ అడవి ఏనుగును బంధించే ఆపరేషన్‌లో ఈ రెండు కుంకీలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. వీటి మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం, ఆపరేషన్లలో ప్రతిభను ప్రాతిపదికగా తీసుకునే అటవీ శాఖ వీటిని ఎంపిక చేసింది.

అసలు సమస్య ఇదే!

పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులకు పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి తరచూ అడవి ఏనుగుల గుంపులు రాకపోకలు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతాల ఆవరణ విస్తీర్ణం తగ్గడం, అడవుల విభజన, నీరు మరియు ఆహారం కొరత ఏర్పడటం వల్ల ఏనుగులు సరిహద్దులు దాటి మన్యం జిల్లాలోని గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పొలాల్లోకి వచ్చి పంటలను తీవ్రంగా నాశనం చేయడంతో పాటు గృహాలపైనా, గ్రామాలపైనా పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో స్థానిక రైతులు, గిరిజనులు నిత్యం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

మన్యం జిల్లాలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఒడిశా ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో చర్చలు జరపాలని, ఏనుగులను తిరిగి స్వస్థలాలకు మళ్లించే చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా ఒడిశా నుంచి మరికొన్ని కుంకీ ఏనుగులను కూడా తీసుకురావాలని భావిస్తున్నారు.

అయితే…. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా ముందుగా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న జయంత్, అభిమన్యులను గుచ్చిమి క్యాంపునకు తరలిస్తున్నారు. ఈ రెండు కుంకీ ఏనుగుల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాల్లో అడవి ఏనుగులను అడవుల్లోకి తోలివేసేలా చర్యలు చేపడతారు.ఇవే కాకుండా సమస్య తీవ్రత ఉన్న ప్రాంతాల్లో సమగ్ర భద్రతా చర్యలను అమలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

  • ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా సౌర కంచెల (Solar Fencing) నిర్మాణం
  • ఏనుగులను నిరోధించడానికి వీలుగా అటవీ సరిహద్దుల్లో పెద్ద కందకాలు తవ్వడం
  • అటవీ అంతర్భాగంలోనే నీటి వనరులను అభివృద్ధి చేయడం
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ, డ్రోన్ నిఘా ఏర్పాటు
  • అత్యవసర స్పందన కోసం 'హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్' బృందాలను రంగంలోకి దించడం
  • ఏనుగుల కదలికలపై గ్రామాల్లో ప్రజలకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More