...
...
Next Story

పెద్దిరెడ్డికి అడవుల్లో వారసత్వ భూములెలా వచ్చాయి..? వీడియో విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్

మంగళంపేట అటవీ భూముల్లోని కబ్జా వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బయటపెట్టారు. 76.74 ఎకరాల అటవీ భూమి కబ్జా అయ్యిందని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ కబ్జాతో సంబంధం ఉందని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

Published on: Nov 13, 2025, 15:11:31 IST
Advertisement

మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేశారు. కబ్జా వివరాలు బయటపెట్టారు. 76.74 ఎకరాల అటవీ భూమి కబ్జా అయ్యిందంటూ ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఇందులో మాజీ అటవీశాఖ మంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందంటూ ప్రకటన చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో 70 ఎకరాల వారసత్వ భూమి పెద్దిరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఉపేక్షించేది లేదు - ఉపముఖ్యమంత్రి

వీడియో రికార్డ్ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్
వీడియో రికార్డ్ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్

“అటవీ భూములు ప్రకృతి సంపద.. జాతి ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్హులవుతారు. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని… మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై ప్రస్తావించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

ఏరియల్ సర్వే…

ఇటీవల చిత్తూరు జిల్లా, ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరం సందర్శించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా మంగళంపేట అటవీ ఆక్రమణలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. అడవిలో వేసిన కంచె, సరిహద్దులను విహంగ వీక్షణం ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో అటవీ భూములు, శాఖ ఆస్తులు పరిరక్షణ అంశంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో తాజాగా సమీక్షించారు.

‘‘అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్ సైట్ లో వెల్లడించాలి. ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేయండి. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయి లాంటి వివరాలు ప్రజలకి తెలియాలి. అటవీ భూముల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం కఠినంగా ఉంది. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకి ఉపక్రమించండి" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఇదంతా ఎలా జరిగింది..? పవన్ కల్యాణ్

“మంగళంపేట సర్వే నంబరు 295, 296ల్లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత..? అది కాలానుగుణంగా ఎలా పెరిగింది అనేది కీలకమైన అంశం. సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసి, అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఓ రకమైన భూ లెక్కలు, అండంగల్ లో మరో రకం భూ లెక్కలు కనిపిస్తున్నాయి. వెబ్ ల్యాండ్ నమోదులోనూ మతలబు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై దృష్టి పెట్టాలి” అని డిప్యూటీ సీఎం పవన్ దిశానిర్దేశం చేశారు.

“పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం నా దృష్టికి వచ్చింది. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకు వెళ్ళాలి" అని సూచించారు.

"భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా చూపారు. ఒకేసారి ఎందుకు ఇంత పెరిగిందన్నది కూడా పరిశీలించాలి. మాజీ అటవీ శాఖ మంత్రి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది…? ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకోవాలి. దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయండి” అని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశిచంారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe