మే నెలాఖరులోగా డీ-రెగ్యులేషన్ ఫేజ్ 2 అమలు చేయాలి : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో అమలు చేస్తున్న డి-రెగ్యులేషన్ విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక ప్రగతికి మే కల్లా డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటు విషయంలో ఎలాంటి జాప్యం జరగ్గకుండా ఇప్పటికే అమలు చేస్తున్న విధానాలను మరింత సరళతరం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనవసరపు చట్టాలను, నిబంధనలను తొలగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డి-రెగ్యులేషన్ ఫేజ్-2 కార్యక్రమంపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయానికి వచ్చింది.

ఈ బృందంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం పెంచడం అనుమతుల సులభతరం చేయడం, అనవసరపు నిబంధనల సడలింపుపై చర్చించారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబుకు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను.. రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, కేంద్రం సూచించిన మార్పులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఫేజ్-1 ఎంత వరకు అమలు చేశారని... ఫేజ్-2లో ప్రస్తుత స్థితి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
డి-రెగ్యులేషన్ ఫేజ్-1లో మొత్తం 7 శాఖల్లో 23 ప్రాధాన్యత అంశాలను పూర్తి చేశామని, ఇక ఫేజ్-2లో 28 ప్రాధాన్య అంశాలు నిర్దేశించుకున్నట్టు అధికారులు చెప్పారు. మొత్తం 47 సిఫార్సుల్లో ఇప్పటివరకు 18 అమలు కాగా, మే 31 నాటికి పూర్తి లక్ష్యం చేరుకుంటామన్నారు.
పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియలో ఉన్న క్లిష్టతను తగ్గించి, వేగం పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలు తొలగింపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రస్తుతం 800కు పైగా ఉన్న నిబంధనలను 100లోపు తీసుకురావాలని, అనుమతులకు లైసెన్సులను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాల్లో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దరఖాస్తు నుంచి అనుమతి వరకూ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ చేయాలని, ఫేజ్-2 అమలు అనంతరం పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సమయం కనీసం 40 శాతం వరకు తగ్గేలా కార్యాచరణను రూపొందించాలని పేర్కొన్నారు.
డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలుకు అవసరమైన ఆర్డినెన్సులు తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమలు, వ్యాపారాల కోసం ప్రస్తుతం 82 రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉందని... ఆ సంఖ్యను దశలవారీగా 57 వరకు తగ్గించాలని సీఎం సూచించారు. బిల్డింగ్ ప్లాన్ ఆమోదాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు వంటి కీలక అనుమతులు 30 వరకు ఉన్న ప్రక్రియలను 18కు తగ్గించేలా చూడాలన్నారు.
నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్రానికి అనుకూలమైన సులభమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలను తీసుకురావడం, పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం, విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన అందించడం వంటి చర్యలు అమలులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ రంగంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు.
డి-రెగ్యులేషన్ విషయంలో కేంద్రం ప్రతిపాదించిన అంశాల కంటే మెరుగ్గా ఏపీ పని చేస్తోందని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ సీఎం చంద్రబాబుతో అన్నారు. నిర్ధిష్ట గడువులోగా ఏపీ ఫేజ్-2ను అమలు చేస్తుందన్న నమ్మకం తమకు ఉందని పౌండ్రిక్ అభిప్రాయపడ్డారు. నేషన్ ఫస్ట్ నినాదంతో తాము పని చేస్తున్నామని.. ఇలాంటి సంస్కరణల ద్వారా భారత దేశ నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. డి-రెగ్యులేషన్ ఫేజ్-3ను అమలు చేస్తున్నారా..? అని ముఖ్యమంత్రి స్టీల్ సెక్రటరీని అడిగారు. జూన్ నెల నుంచి ఆ పని మీద ఉంటామని పౌండ్రిక్ తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


