AP Pattadar Passbooks : రైతు ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేలా చేస్తాం - సీఎం చంద్రబాబు

‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. రైతు ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేలా చూసే దిశగా మార్పులు తీసుకువస్తామన్నారు.

Published on: Apr 9, 2026, 18:15:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి భూమిని హక్కుగా కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రైతులు ఇక ఎమ్మార్వో కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండానే ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేలా చూస్తామని ప్రకటన చేశారు.

రైతుకు పట్టాదారు పాస్ బుక్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు
రైతుకు పట్టాదారు పాస్ బుక్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు

గురువారం బాపట్ల జిల్లాలోని వేమూరులో పర్యటించిన ఆయన… ‘మీ భూమి- మీహక్కు’ పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రసంగించారు. అంతకంటే ముందు ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు.

గత పాలకులు రాష్ట్ర విభజన కంటే దారుణంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 2019-24 మధ్య దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కానీ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని పనులు కూడా చేసి చూపిస్తున్నామన్నారు. సుపరిపాలన ఇవ్వాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నామని విరించారు.

“గాడి తప్పిన వ్యవస్థలను సంస్కరించి పారదర్శక పాలనకు నాందిపలికాం. రెవెన్యూ శాఖలో చేసిన విధ్వంసం కారణంగా దానిని పునరుద్ధరించడానికి ఇన్ని నెలలు పట్టింది. ప్రజల ఆస్తులకు భరోసా, ప్రజల జీవితాలకు విశ్వాసం కల్పించాలన్న కారణంగా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. గత పాలకులు మీ భూమిపైనే కన్ను వేసి కట్టడి చేయాలని, బ్లాక్ మెయిల్ చేయాలని ఆలోచన చేశారు. రికార్డులు తారుమారు చేసి, కబ్జాలకు, భూ వివాదాలకు తెరలేపారు. మీ ఆస్తిపై వారు బొమ్మలు వేసుకున్నారు. 2019-24 మధ్య జరిగిన వ్యవహారాల కారణంగా పెద్ద ఎత్తున భూవివాదాలు వచ్చాయి. అందుకే శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి భూమిని హక్కుగా మీకు కల్పించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం” అని సీఎం తెలిపారు.

సీఎం చంద్రబాబు ప్రసంగం - ముఖ్యమైన అంశాలు:

  • "2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తి చేసి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
  • 16,816 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉంది, ఇప్పటికి 6,976 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి అయ్యింది.
  • 21.23 లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేశాం. జూలై నాటికి మరో 9 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం.
  • ఈ నెలలోనే 1,56,433 పాస్ పుస్తకాలు ఇచ్చాం. మరో 80 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది.
  • అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం. ఎవరూ తారుమారు చేసే అవకాశం లేకుండా మీకు భూ యాజమాన్య హక్కు పత్రాలను ఇస్తున్నాం
  • ఇ-కేవైసీ, ఆధార్ అనుసంధానంతో ఈ రికార్డును పటిష్టంగా తయారు చేసి పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. మీ రికార్డులు ఎవరూ ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రత కల్పిస్తున్నాం
  • క్యూఆర్ కోడ్ తో మీ భూమి వివరాలు తెలుసుకునేలా ప్రత్యేకంగా ముద్రించాం. అలాగే ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని డిజిటల్ గా లాకింగ్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించాం. యజమానులు వచ్చి ఈ-కేవైసీ, ఆధార్ తో అన్ లాక్ చేస్తే తప్ప మీ ఆస్తిని ఎవరూ తీసుకోలేరు.
  • గ్రామ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములను 22ఏ నుంచి 1.37 లక్షల ఎకరాలను తొలగిస్తున్నాం.
  • మరో 1 లక్ష ఎకరాల సర్వీసు ఇనామ్ భూములను కూడా 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం.
  • 2016 కంటే ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతీ ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యం కల్పిస్తున్నాం. లబ్దిదారులు క్రయవిక్రయాలకు, గిఫ్ట్ డీడ్‌లకు అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం.
  • రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్‌ కింద అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాం.
  • సచివాలయంలోనే భూమి రికార్డులకు సంబంధించిన వివరాలను సరిచేసుకునే అవకాశాన్ని కూడా స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో చేసుకోవచ్చు.
  • గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ఆటోమ్యుటేషన్ ప్రక్రియ ద్వారా మేలు జరిగేలా చూస్తున్నాం. రైతులు ఇక ఎమ్మార్వో కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఆస్తులు బదిలీ కాగానే ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేలా చూస్తాం.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ సంస్కరణల్ని తీసుకు రావాలని ఆలోచన చేస్తున్నాం. ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ జరిగేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం. రూ.10 లక్షల లోపు ఉన్న వారసత్వ భూములు రూ.100, అంతకంటే ఎక్కువ విలువ ఉన్న వారసత్వ భూములు రూ.1 వెయ్యితో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు" అని సీఎం చంద్రబాబు వివరించారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More