రైతు పట్టాదారు పుస్తకాలు ట్యాంపరింగ్ చేస్తే నేరుగా జైలుకే - సీఎం చంద్రబాబు వార్నింగ్
రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను ట్యాంపరింగ్ చేస్తే నేరుగా జైలుకే వెళ్తారని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే పీడీ యాక్టు కింద కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. 2027 డిసెంబర్ నాటికి అందరికీ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకం అందుతుందని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2027 డిసెంబరు నాటికి సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు.

నేరుగా జైలుకే పంపుతాం - సీఎం చంద్రబాబు
శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగొట్ల గ్రామంలో మీ భూమి- మీహక్కు కింద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భవిష్యత్ లో ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా…. ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా ట్యాంపరింగ్ కు ప్రయత్నిస్తే నేరుగా జైలుకే వెళతారని… అవసరమైతే పీడీ యాక్టు కింద కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రసంగిస్తూ...మీ భూమికి భద్రత కల్పించడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. భూమి ఆస్తి ఒక్కటే కాదు..అది మన జీవనాధారమన్నారు. కూటమి ప్రభుత్వం భూమి- నీరు-సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
“గత పాలకులు తప్పుడు విధానాలతో ప్రజలను బానిసలు చేయాలని కుట్ర చేశారు. లోపభూయిష్టమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారు. ప్రజల జుట్టు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై వారి ఫొటోలు, పేర్లు ముద్రించుకున్నారు. వాళ్లు అడిగిన భూములు ఇవ్వకపోతే 22 ఏలో పెట్టారు. కక్ష తీర్చుకోవడానికి అన్ని ఆయుధాలు ఉపయోగించారు. రీ సర్వే పేరుతో రూ.700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.
క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు….
“అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం. భవిష్యత్ లో ఎవరూ ప్రజల భూమిపై కన్ను వేయకుండా భద్రత కల్పిస్తున్నాం. ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను వెంటనే తెలుసుకోవచ్చు. మీ పాసు పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే అందులో వచ్చే మ్యాప్ మిమ్మల్ని నేరుగా మీ పొలం వద్దకు తీసుకు వెళుతుంది. డాక్యుమెంట్ల వివరాలను ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ లాంటి పటిష్ట వ్యవస్థను తెస్తున్నాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
"ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున రాష్ట్రంలో మొత్తం 279 గ్రామాల్లో ముందుగా పంపిణీ చేపట్టాం. ప్రస్తుతం 1,16,870 డ్రాఫ్ట్ పాస్ బుక్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 91,038 డ్రాఫ్ట్ పాస్ బుక్స్ eKYC కూడా పూర్తయ్యింది. 19 లక్షలు లక్షలు ఇప్పటికే పంపిణీ చేయగా..18 లక్షల 40 వేలు ఏప్రిల్ లోగా పంపిణీ చేస్తాం. ఇది కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 60 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం వస్తుంది. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికీ పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
శ్రీవారి లడ్డూ వివాదం - సీఎం కీలక వ్యాఖ్యలు
ఇదే సభలో శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారని చెప్పారు. "నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికతో మేం మాట్లాడుతుంటే.. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. రసాయనాలు కలిసినట్టు నివేదికలో ఉందని వాళ్ల బాబాయ్ కూడా మాట్లాడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాం” అని ప్రకటించారు.
“శ్రీశైలంలోనూ రసాయనాలు వాడి ప్రసాదం కల్తీ చేశారు. తప్పు చేసి నన్ను క్షమాపణ చెప్పమంటున్నారు. పరామర్శల పేరుతో గుంటూరు వెళ్లేందుకు 6 గంటలు రోడ్డు బ్లాక్ చేసి మరే వాహనాలు వెళ్లకుండా ఇబ్బందులు పెట్టారు. గతంలో కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తిని తొక్కించి చంపారు. బంగారుపాళ్యంలో మామిడి కాయలను కింద పడేసి బల ప్రదర్శనకు దిగారు. బలప్రదర్శన ఎన్నికల సమయంలో చేయాలి. ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోను. శాంతిభద్రతల నిర్వహణలో కఠినంగా ఉంటాను”అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

E-Paper












