సాగు నీటి సంఘాల పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తాం - సీఎం చంద్రబాబు
నీరు-ప్రగతి-జలహారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వ్యవయసాయంలో ఉపయోగించే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్లను పరిశీలించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని ప్రకటించారు.
ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా సాగునీటి సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని సమర్థ పాలన, నిర్దిష్ట ప్రణాళికలతో రైతు సానుకూల రాష్ట్రంగా మార్చామని స్పష్టం చేశారు.

గురువారం అమరావతిలోని నేలపాడు వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నీరు-ప్రగతి, జల హారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ముందుగా సమావేశ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.…"మన జీవన విధానంలో నీరు చాలా ముఖ్యం. రాయలసీమలో ఊట కాల్వలు ఉండేవి. వాటిలో నీరు సమృద్ధిగా ఉండటంతో పంటలు పండేవి. కాలక్రమంలో నీటిపై నిర్లక్ష్యంతో సమస్యలు వచ్చాయి. సీమ ఎడారిగా మారుతుందని చాలామంది అనేవారు. సీమను రతనాల సీమ చేయాలని ఎన్టీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ సహా అనేక ప్రాజెక్టులు రావడానికి నాడు తెలుగుదేశం పార్టీ చూపిన చొరవే కారణం. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నీరు-చెట్టు వంటి కార్యక్రమాలు చేపట్టాం"అని వివరించారు.
“ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేలా తాగు నీటి సంఘాల అధ్యక్షులు కృషి చేయాలి. సమర్థ నీటి వినియోగంలో రైతుల భాగస్వామ్యం కీలకం. ఈ ఉద్దేశంతోనే 1997లో దేశంలోనే మొదటిసారిగా సాగు నీటి సంఘాలు ఏర్పాటు చేశాం. ఈ వ్యవస్థ ద్వారా 14 లక్షల నీటి సంరక్షణ కట్టడాలు నిర్మించాం. 2024 డిసెంబర్లో 6,047 నీటి వినియోగదారుల సంఘాలకు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 58 ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాం. నీటి సంఘాల అధ్యక్షులు పనులు సమర్థవంతంగా చేస్తున్నారు"అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
"సాగు నీటి నిర్వహణ పనులను నామినేషన్ పద్దతిలో అప్పగించే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. కాలువల నిర్వహణ, నీటి పన్నుల వసూలు, వివాదాల పరిష్కారంలో నీటి వినియోగదారుల సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తాం. సమర్థ నీటి నిర్వహణతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది నారు మళ్లకు మే 15 నాటికే నీరు అందిస్తాం”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఆ తర్వాతనే నదుల అనుసంధానం - సీఎం
కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2027 జూన్ కంటే ముందే పోలవరం కల సాకారమై జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. “పోలవరం పూర్తి చేశాక నదుల అనుసంధానం చేపడతాం. పట్టి సీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మార్చి లోగా పూర్తి చేసి అనకాపల్లి, విశాఖకు నీరు అందిస్తాం. తారక రామ తీర్ధసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు రాబోయే మూడేళ్లలో పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తాం. గోదావరి నీళ్లు వంశ ధారకు అనుసంధానం చేస్తాం. పోలవరం నుంచి నీటిని నల్లమల సాగర్ కు తీసుకెళ్తాం” అని ప్రకటించారు.
“ఈ ఏడాది గోదావరి నుంచి 5000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోయింది. 200 టీఎంసీల వరద జలాలు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకొస్తాం. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మిస్తుంటే మేము ఏనాడు అడ్డు చెప్పలేదు. ఇదే తరహా స్పందనను తెలంగాణ నుంచి కోరుకుంటున్నాం. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు చిత్తూరు, మడకశిరకు తీసుకొచ్చాం. రాష్ట్రంలోని అన్ని చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి" అని అభిప్రాయపడ్డారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

