Dhiraj Bommadevara : ఆర్చరీలో స్వర్ణం సాధించిన ధీరజ్‌ బొమ్మదేవర.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Dhiraj Bommadevara : మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ 2026లో స్వర్ణ పతకం సాధించాడు ధీరజ్ బొమ్మదేవర. మరోవైపు ఉమెన్స్ టీ20 ఆసియా కప్ 2026 టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Published on: Sep 14, 2026, 18:56:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెక్సికోలోని సాల్టిల్లో వేదికగా ముగిసిన 'ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ 2026'లో విజయవాడకు చెందిన ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా ధీరజ్ రికార్డులకెక్కాడు. ఫైనల్ పోరులో జపాన్ క్రీడాకారుడు నకానిషి జున్యాపై 6-5 తేడాతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన షూట్-ఆఫ్ దఫాలో 10 పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు ధీరజ్.

ధీరజ్‌ బొమ్మదేవర
ధీరజ్‌ బొమ్మదేవర

మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న తెలుగు విలుకాడు ధీరజ్ బొమ్మదేవరపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. ధీరజ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

'విజయవాడ ఆర్చరీ మైదానాల నుంచి ప్రారంభమైన ప్రయాణం, మెక్సికోలోని ప్రపంచ విజేతల వేదికపై అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ క్రీడారంగంలో ఒక కొత్త చరిత్ర నమోదైంది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో పురుషుల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ విలుకాడిగా ధీరజ్ నిలిచాడు.' అని చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ధీరజ్ చూపించిన కఠోర శ్రమ, పట్టుదల, దృష్టి కేంద్రీకరణల వల్లే ఈ అద్భుత ఘనత సాధ్యమైందని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రంలోని వేలాదిమంది యువ క్రీడాకారులకు ధీరజ్ స్ఫూర్తిప్రదాతగా నిలిచారని, భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు శుభాకాంక్షలు అందించారు.

అంకితభావం, నిరంతర సాధన, క్రమశిక్షణల సమాహారమే ధీరజ్ విజయాకారమని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ధీరజ్ సాధించిన ఈ విజయం వల్ల భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా చరిత్రకు అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని ప్రాచుర్యం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

మరోవైపు దుబాయ్ వేదికగా ముగిసిన ఉమెన్స్ టీ20 ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను ఓడించి, ఏకంగా 8వ సారి ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును నారా లోకేష్ ప్రశంసించారు. ఈ చారిత్రాత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ స్పిన్నర్ శ్రీ చరణి కీలక పాత్ర పోషించారని లోకేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీ చరణి తన 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్నువిరిచింది. ఈ మ్యాచ్‌లోని ప్రదర్శనతో శ్రీ చరణి ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు(39 వికెట్లు) తీసిన భారత బౌలర్‌గా ఘనత సాధించింది. భారత మహిళల జట్టు చూపిన టీమ్ స్పిరిట్‌ దేశంలోని వేలాదిమంది యువ క్రీడాకారులకు గొప్ప ప్రేరణనిస్తుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More