విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దివ్య తెప్పోత్సవం కృష్ణా నదీ తీరంలో భక్తులకు నయన మనోహరంగా నిలిచింది. దసరా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణమ్మ ఒడిలో ఆదిదంపతులు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దివ్యానుభూతిని, మహోన్నతమైన ఆశీస్సులను అందించారు. నదీ తీరమంతా వెల్లివిరిసిన భక్తిపారవశ్యంతో మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పరవశించిపోయారు.

రంగురంగుల విద్యుద్దీపాలు, సువాసనలు వెదజల్లే రకరకాల పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై అమ్మవారు, మల్లేశ్వర స్వామివారు కొలువుదీరారు. విద్యుత్తు కాంతుల వెలుగులు నదీ జలాల్లో ప్రతిబింబిస్తూ కృష్ణమ్మ ఒడిలో సరికొత్త ఆధ్యాత్మిక వర్ణశోభను ఆవిష్కరించాయి. స్వయంప్రకాశితంగా మెరుస్తున్న హంసవాహనంపై స్వామివార్ల దివ్య విహారాన్ని తిలకించిన భక్తజనం 'దుర్గా భవానీ జై' అంటూ వేసిన జయజయధ్వానాలతో, కనకదుర్గమ్మ నామస్మరణలతో నదీ తీరం ప్రతిధ్వనించింది.
వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ వేడుక ఇంద్రకీలాద్రి క్షేత్ర ఆధ్యాత్మిక వైభవాన్ని నలుదిశలా చాటిచెప్పింది. ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ ఒడిలో హంసవాహనరూపంలో కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనభాగ్యం కలగడం తమ పూర్వజన్మ సుకృతమని, జీవితంలో మరచిపోలేని అపురూపమైన అనుభూతిని ఇచ్చిందని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో మురిసిపోయారు.
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇవాళ్టితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. పది రోజుల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం పొందారని అధికారులు వెల్లడించారు. ఇదే సందర్భంలో దాదాపు 8 లక్షల మంది అన్నప్రసాదం అందించనట్లు పేర్కొన్నారు.
గతంతో పోలిస్తే దర్శనానికి పట్టే సమయం తగ్గడం, సేవల నాణ్యత పెరిగిందని అధికారులు తెలిపారు. భక్తులకు సాధ్యమైనంత సులభంగా దర్శనం దక్కేలా, వారి సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ చేసిన ఏర్పాట్లపై భక్తుల నుంచి ఎంతో సంతృప్తి వ్యక్తం అవుతోందన్నారు.