గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ : విజయవాడ నుంచి బెంగళూరుకు ఇక 7 గంటల్లోనే..! రూట్ మ్యాప్ వివరాలివే
బెంగళూరు-విజయవాడ మధ్య రవాణా వ్యవస్థను వేగవంతం చేసేందుకు రూ.19,200 కోట్లతో 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరగుతోంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే జర్నీ సమయం సగానికి పైగా తగ్గనుంది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక, రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక బెంగళూరు-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్తోంది. భారత్‌మాల పరియోజనా ఫేజ్-2 కింద రూపుదిద్దుకుంటున్న ఈ 6 లైన్ల ప్రాజెక్ట్… యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా అందుబాటులోకి రానుంది. కొత్తగా నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారితో పాటు ప్రస్తుతం ఉన్న పలు కీలక రహదారులను ఆధునీకరిస్తూ ఈ విస్తృత కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వర్గాలు వెల్లడించాయి.

తగ్గనున్న జర్నీ టైమ్…..
ప్రస్తుతం బెంగళూరు నుంచి విజయవాడ చేరుకోవడానికి సుమారు 11 నుంచి 12 గంటల సమయం పడుతోంది. అయితే ఈ నూతన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గి, కేవలం 6 నుంచి 7 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సాధారణ ప్రయాణికులకు ప్రయాణం సులభతరం కావడమే కాకుండా, రెండు నగరాల మధ్య సరుకు రవాణా విపరీతంగా వేగవంతమవుతుంది.
రూట్ మ్యాప్, ప్రాజెక్టు అంచనా వ్యయం ఇలా….
ఈ ప్రాజెక్టులో భాగమైన నూతన గ్రీన్ ఫీల్డ్ రహదారి విభాగం మొత్తం 342 నుంచి 343 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని కోడికొండ వద్ద ప్రారంభమై అద్దంకి సమీపంలోని ముప్పవరం వరకు సాగుతుంది. ఇక పాత రహదారుల విస్తరణ, ఆధునీకరణలను కూడా కలిపితే ఈ మొత్తం కారిడార్ పొడవు 518 కిలోమీటర్ల నుంచి 624 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 19,200 కోట్ల నుంచి రూ. 19,320 కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా వేశారు.
ఈ ప్రధాన రహదారి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కర్నూల్, కడప జిల్లాల గుండా వెళ్తుంది. రద్దీగా ఉండే పట్టణాలు, పాత జాతీయ రహదారులకు బైపాస్‌గా ఈ అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఫలితంగా పాత రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఈ కారిడార్ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు, పారిశ్రామిక వస్తువులను బెంగళూరు, విజయవాడ మార్కెట్లతో పాటు తూర్పు తీరంలో ఉన్న వివిధ ఓడరేవులకు (పోర్టులకు) వేగంగా రవాణా చేయడానికి మార్గం సుగమమవుతుంది.
ప్రకాశం జిల్లా పరిధిలో 110 కిలోమీటర్లు…..
ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గుండా అత్యధికంగా దాదాపు 110 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. జిల్లాలోని చంద్రశేఖరపురం, కనిగిరి, వెలిగండ్ల, మర్రిపూడి, చీమకుర్తి, తాళ్లూరు, అద్దంకి, కొండపి, పంగులూరు వంటి పలు మండలాల మీదుగా ఈ రోడ్డు సాగుతుంది. కనిగిరి, పొదిలి వంటి ప్రధాన పట్టణాలు కూడా ఈ కారిడార్ పరిధిలోనే రానున్నాయి.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో భూమి సిద్ధం చేయడం, కల్వర్టులు, వంతెనల నిర్మాణం, తార్ రోడ్డు (బ్లాక్‌టాప్) వేసే పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రత్యేకించి నారాయణంపేట-చంద్రశేఖరపురం మరియు పోలవరం-మర్రిపాడు మార్గాల్లో పనులు గణనీయమైన పురోగతి సాధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే స్థానిక ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి.
ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను మొత్తం 14 ప్యాకేజీలుగా విభజించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలైన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL), కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, దిలీప్ బ్యూల్డ్కాన్లు ఈ కాంట్రాక్టులను దక్కించుకుని పనులు వేగవంతం చేశాయి. భారీ ఎత్తున మట్టి తరలింపు, ఎంబ్యాంక్మెంట్ల నిర్మాణం, తార్ రోడ్ల నిర్మాణం అన్ని ప్యాకేజీల్లోనూ ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇటీవల జనవరి 2026లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. విస్తృత బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌ను 2027 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
మరోవైపు…. ఈ నూతన ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానతను పెంచేందుకు NHAI మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని దేవునహళ్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కోడికొండ వరకు ఉన్న 90 కిలోమీటర్ల జాతీయ రహదారి 44 (NH-44)ను విస్తరించి అభివృద్ధి చేయడానికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను సిద్ధం చేస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

