తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతఃకాల కైంకర్యాలు ముగించారు. ఆ తర్వాత గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు.

{{^htLoading}} {{/htLoading}}
పల్లకీలో మాడవీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య శుభముహుర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని 3 సార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది.
మరోవైపు ఈ జనవరి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
- జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.
- జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర.
- జనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.
- జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.
- జనవరి 14న భోగి.
- జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.
- జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.
- జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
- జనవరి 23న వసంత పంచమి.
- జనవరి 25న రథ సప్తమి.