Ration Card Download : రేషన్ కార్డు మిస్ అయిందా..? ఈ 'యాప్'తో ఫోన్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు
రేషన్ కార్డు పోయినా, అందుబాటులో లేకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘మేరా రేషన్ 2.0’ యాప్ ద్వారా ఆధార్ నంబర్‌తో లాగిన్ అయి…. మీ రేషన్ కార్డు వివరాలను చాలా సులభంగా పొందొచ్చు.
…రేషన్ కార్డు ఎక్కడైనా పోయినా, అత్యవసర సమయాల్లో చేతిలో లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేటి డిజిటల్ యుగంలో మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే నిమిషాల్లో రేషన్ కార్డు వివరాలను తెలుసుకునే వీలుంది.

ఈజీగా వివరాలు చెక్ చేసుకోవచ్చు….
సామాన్య ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'మేరా రేషన్ 2.0' (Mera Ration 2.0) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీ రేషన్ కార్డు పూర్తి సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రతినెలా వచ్చే రేషన్ కోటా వంటి సేవలను ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చు. ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటే చాలు, యాప్‌లో లాగిన్ అయి అవసరమైన వివరాలను వెంటనే పరిశీలించుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డు' (ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు) విధానం వలస కార్మికులకు, ఇతర ప్రాంతాల్లో నివసించే వారికి ఎంతో మేలు చేస్తోంది. ఈ విధానం ద్వారా లబ్ధిదారులు దేశంలో ఏ మూలన ఉన్నా పోర్టబిలిటీ సదుపాయంతో తమకు రావాల్సిన రేషన్ సరుకులను తీసుకోవచ్చు. అంటే… తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్డుదారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, అక్కడి రేషన్ దుకాణాల్లో తమ అర్హత ప్రకారం సరుకులు పొందే వీలుంది.
ఈ సేవలను మరింత సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి కేంద్రం Mera Ration 2.0 యాప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా కేవలం రేషన్ కార్డు వివరాలను చూడటమే కాకుండా…. సమీపంలోని రేషన్ దుకాణాల చిరునామాలు, గతంలో తీసుకున్న సరుకుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
మీ వివరాలు ఇలా చెక్ చేసుకోవచ్చు :
- ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి.
- పైన కనిపించే సెర్చ్ బాక్స్‌లో Mera Ration 2.0 అని టైప్ చేసి వెతకండి.
- కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక యాప్‌ను గుర్తించి, మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి.
- ఇన్స్టాల్ పూర్తయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి, హోమ్ స్క్రీన్‌పై కనిపించే 'Beneficiary User' ఆప్షన్‌ను ఎంచుకోండి.
- అనంతరం మీ 12 అంకెల ఆధార్ నంబర్‌తో పాటు, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్ వివరాలను తప్పుల్లేకుండా నమోదు చేయండి.
- ఆ తర్వాత 'Login with OTP' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్ (OTP)ని నమోదు చేసి వెరిఫై చేయండి.
- లాగిన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, భవిష్యత్తులో సులభంగా యాప్ వాడుకునేందుకు స్క్రీన్‌పై సూచించిన విధంగా 4 అంకెల MPIN సెట్ చేసుకోండి.
- ఇప్పుడు యాప్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్లి మీ డిజిటల్ రేషన్ కార్డు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవచ్చు.
- యాప్‌లో 'Download' ఆప్షన్ అందుబాటులో ఉంటే దానిపై క్లిక్ చేసి, అడిగిన రేషన్ కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా మీ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గమనిక : ఓటీపీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారిక యాప్ ను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అనధికారిక యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

