...
...
Next Story

APPSC Group 1 Valuation Scam : గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు - రంగంలోకి ఈడీ..! 7 చోట్ల సోదాలు

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. బుధవారం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు సహా పలువురు నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది.

Published on: Nov 4, 2026, 13:41:36 IST
Advertisement

APPSC Group 1 Valuation Scam : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన భారీ అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో ఈడీ చర్యలు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ…. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టింది. 1992 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పి. సీతారామాంజనేయులు (పీఎస్ఆర్ ఆంజనేయులు) నివాసంతో పాటు, పలు అనుమానిత సంస్థల కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.

మొత్తం 7 చోట్ల ముమ్మర సోదాలు

ఈడీ సోదాలు
ఈడీ సోదాలు

హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని ఆరు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతంతో కలిపి మొత్తం ఏడు చోట్ల ఈ దాడులు కొనసాగాయి. ఈ తనిఖీల్లో ఈడీ అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వివాదం ఏంటి..?

2018లో ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించి 2020లో మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. వీటి జవాబుపత్రాలను అర్హత లేని 66 మందితో మూల్యాంకనం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మూల్యాంకన ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించారని…. భారీగా నిధులు మళ్లించారని ప్రధాన ఆరోపణ. ఆ సమయంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన పీఎస్ఆర్ ఆంజనేయుల నేతృత్వంలో 'కామ్‌సైన్ మీడియా' (Camsign Media) అనే ప్రైవేటు కంపెనీకి మాన్యువల్ మూల్యాంకనం పనులు అప్పగించారు. ఈ ప్రక్రియలో రూ.1.14 కోట్ల ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ రంగానికి చెల్లించారని ఈడీ ప్రాథమిక విచారణలో తేల్చింది.

గుంటూరు జిల్లా చినకాకాని గ్రామంలో ఉన్న 'ఆవాస రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్' (హాయ్‌లాండ్) లో గ్రూప్-1 జవాబు పత్రాలను ఉంచి, అక్కడే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. నియమావళికి విరుద్ధంగా రిసార్టులో నిర్వహించిన ఈ ప్రక్రియపై మొదటి నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బుధవారం నాటి సోదాల్లో ఈ రిసార్ట్ ప్రాంగణాన్ని కూడా ఈడీ బృందాలు విస్తృతంగా తనిఖీ చేశాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks