Botcha Emotional : కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం - కన్నీటిపర్యంతమైన మాజీ మంత్రి బొత్స!
విజయనగరం జిల్లా గరివిడిలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. బొత్స మేనల్లుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆయనతో తమకున్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకుని ఆవేదన చెందారు.
విజయనగరం జిల్లా గరివిడిలోని క్యాంప్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 'ఆత్మీయ కలయిక' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అంతేకాదు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

పార్టీనే శాశ్వతం - బొత్స
కార్యకర్తలను ఉద్దేశించి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. "రాజకీయాల్లో నాయకులు లేదా వ్యక్తులు రావొచ్చు, వెళ్లిపోవచ్చు. కానీ మనం ప్రాణంగా భావించే పార్టీ ఎప్పటికీ శాశ్వతం. కాబట్టి ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. చీపురుపల్లి నియోజకవర్గంలో మనమంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా ఉండాలి," అని దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత జగన్ ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
త్వరలోనే జరగనున్న జిల్లా విస్తృత స్థాయి సమావేశంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడమే మన ఏకైక లక్ష్యం కావాలి. దీనికోసం ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో కష్టపడి పనిచేద్దాం," అని స్పష్టం చేశారు.
ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష, యువ నాయకుడు డాక్టర్ బొత్స సందీప్ మాట్లాడుతూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. "రాబోయే రోజుల్లో ప్రతి నాయకుడికి, కార్యకర్తకు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. మీ కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తాం. బొత్స సత్యనారాయణ మార్గదర్శకంలో, ఆయన సూచనలకు అనుగుణంగా మనమంతా కలసికట్టుగా ముందుకు సాగుదాం. స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడమే మన తక్షణ కర్తవ్యం" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కిల్లి సత్యనారాయణలతో పాటు చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ నాయకత్వంలో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇటీవలనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బొత్సకు మేనల్లుడైన చిన్న శ్రీను…. వైసీపీ బలోపేతానికి మజ్జి శ్రీనివాసరావు కీలక భూమిక పోషించారు. జిల్లా వ్యాప్తంగా బలమైన నాయకత్వ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నారు. గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన… తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరటం వైసీపీకి పెద్ద షాక్ నిచ్చింది. అంతేకాకుండా బొత్సకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బొత్స… నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

