AP Govt : నేతన్నలకు గుడ్ న్యూస్ - పెన్షన్ దరఖాస్తులో కీలక నిబంధన మినహాయింపు
Nethanna Bharosa Pension Scheme :నేతన్న భరోసా పెన్షన్ దరఖాస్తుదారులకు నిబంధనలు సడలిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్యాంక్ స్టేట్‌మెంట్ అవసరం లేదని…. మాస్టర్ వీవర్ వేతన వివరాలు ఇస్తే సరిపోతుందని మంత్రి సవిత వెల్లడించారు.
నేతన్న భరోసా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేతలకు ఊరటనిచ్చేలా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలు బ్యాంకు స్టేట్ మెంట్ అందజేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు తీసుకున్న వివరాలు అందజేస్తే సరిపోతుందన్నారు.

అన్ని రకాల పెన్షన్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల ఏడో తేదీ నుంచి వృద్ధ్యాప్యం, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత సహా అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేతన్న భరోసా పెన్షన్ కు దరఖాస్తు చేస్తుకుంటున్న నేతన్నలకు బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధన తీవ్ర ప్రతిబంధకంగా మారింది.
మాస్టర్ వీవర్ దగ్గర పనిచేసే చేనేతలకు వ్యక్తిగతంగానే వేతనాలు చెల్లిస్తూ వస్తుంటారు. అటువంటి సమయంలో బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధన పెట్టడంతో చేనేతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇదే విషయమై పలువురు నేతన్నలు, చేనేత సంఘాల ప్రతినిధులు మంత్రి సవిత దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. తక్షణమే ఆమె స్పందించి, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి చేనేతల సమస్యను తీసుకెళ్లారు.
స్టేట్ మెంట్ అవసరం లేదు - మంత్రి సవిత
బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ నిబంధనను సడలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో…. అర్హులైన చేనేతలందరికీ నేతన్న భరోసా పెన్షన్లు అందజేసే అవకాశం కలిగిందని మంత్రి సవిత తెలిపారు. నూతన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ నేతన్న భరోసా పెన్షన్లు అందజేస్తామని, అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
ఆయా జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులు బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లు లేకున్నా దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది నేతన్నలకు ఉపశమనం కలగనుందని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల మందికిపైగా నేతన్నలకు నేతన్న భరోసా పెన్షన్ పథకం కింద రూ.4 వేలు చొప్పున అందజేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్, నేతన్నల సేవలో పథకం కింద ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి సవిత గుర్తు చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

