గ్యాస్ కస్టమర్లకు కేంద్రం తీపి కబురు: ఎల్‌పీజీ బుకింగ్ గడువు తగ్గించిన ప్రభుత్వం

గ్రామీణ ప్రాంతాల ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం అందించింది. గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ సమయాన్ని 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Published on: Sep 7, 2026, 15:58:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్యాస్ వినియోగదారులందరికీ సమాన నిబంధనలు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ రీఫిల్ బుకింగ్ కోసం ఉన్న 45 రోజుల ఆంక్షలను సడలిస్తూ, దానిని 25 రోజులకు తగ్గించారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

గ్యాస్ కస్టమర్లకు కేంద్రం తీపి కబురు: ఎల్‌పీజీ బుకింగ్ గడువు తగ్గించిన ప్రభుత్వం
గ్యాస్ కస్టమర్లకు కేంద్రం తీపి కబురు: ఎల్‌పీజీ బుకింగ్ గడువు తగ్గించిన ప్రభుత్వం

ఈ నయా నిబంధనలతో ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న గృహ వినియోగదారులందరూ ప్రతి 25 రోజులకు ఒకసారి ఎల్‌పీజీ రీఫిల్ బుక్ చేసుకునే వెసులుబాటు లభించనుంది.

ఆంక్షల సడలింపు వెనుక కారణాలివే

అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చమురు రవాణా నిలిచిపోవడం వల్ల దేశంలో ఎల్‌పీజీ సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో గ్యాస్ అక్రమ నిల్వలను నిరోధించేందుకు ప్రభుత్వం డిమాండ్ నియంత్రణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల బుకింగ్ వ్యవధిని అమలులోకి తెచ్చారు.

అయితే, ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. సిలిండర్ల పంపిణీలో ఉన్న పెండింగ్ (బ్యాక్‌లాగ్) కూడా గణనీయంగా తగ్గింది. దీంతో నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వెంటనే అమలు చేయాలని ఆదేశాలు

"ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగైంది. రీఫిల్ బ్యాక్‌లాగ్ గణనీయంగా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆంక్షలను సడలించింది. ఇకపై గ్రామీణ, పట్టణ వ్యత్యాసం లేకుండా అందరూ ప్రతి 25 రోజులకు ఒకసారి ఎల్‌పీజీ రీఫిల్ బుక్ చేసుకోవచ్చు" అని కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

ఈ నూతన నిబంధనలను తక్షణమే అమలు చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వుల ప్రతిని కూడా మంత్రి పంచుకున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More