...
...
Next Story

ఏపీ తీరానికి కొట్టుకొచ్చిన బోటు.. అందులో నలుగురి మృతదేహాలు!

మురసు తుపాను బీభత్సం సృష్టించింది. దీని ప్రభావంతో ఓ మత్స్యకారుల బోటు ఏపీ తీరానికి కొట్టుకొచ్చింది. అయితే అందులో నలుగురి మృతదేహాలు కనిపించాయి.

Published on: Nov 5, 2026, 14:18:18 IST
Advertisement

మురసు తీవ్ర తుపాను ధాటికి ప్రకాశం జిల్లా తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాను సమయంలో సముద్రంలో గల్లంతైన తమిళనాడు మత్స్యకారుల బోటు కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చింది. అందులో నలుగురి మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు కీలక వివరాలను వెల్లడించారు.

ఏపీ తీరానికి కొట్టుకొచ్చిన నలుగురి మృతదేహాలు
ఏపీ తీరానికి కొట్టుకొచ్చిన నలుగురి మృతదేహాలు

ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 29న తమిళనాడు రాజధాని చెన్నై నుండి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే మురసు తీవ్ర తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రమాదం నుంచి తప్పుకునేందుకు వారి బోట్లను సమీపంలోని సురక్షిత తీరాలకు తరలించాలని అధికారులు సూచించారు.

ఆ సూచనల ప్రకారం తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు చేరుకుని లంగరు వేశాయి. ఇందులో మూడు బోట్లు రామాయపట్నం పోర్టు వద్ద, ఒక బోటు నిజాంపట్నం పోర్టు వద్ద సురక్షితంగా నిలిపారు. నవంబర్ 2 నాటికి మత్స్యకారులు, వారి బోట్లు అన్నీ సురక్షితంగా ఉన్నాయని తమిళనాడు అధికారులు కూడా ప్రాథమికంగా ధ్రువీకరించారు.

పరిస్థితి సురక్షితంగానే ఉందనుకున్న వేళ నవంబర్ 3న అనూహ్య ఘటన జరిగింది. నిజాంపట్నం పోర్టు వద్ద లంగరు వేసిన బోటులోని తొమ్మిది మంది మత్స్యకారులు, రామాయపట్నంలో ఉన్న తమ సహచరులను కలిసేందుకు బయలుదేరారు. అయితే ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు అధికారులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

రామాయపట్నం వైపు వెళ్తున్న క్రమంలో, సముద్రంలో ఉధృతంగా వీస్తున్న ఈదురుగాలులు, అలల ధాటికి వారి బోటు చిక్కుకుపోయి తీవ్ర తుపాను తాకిడికి గల్లంతు అయింది. దీంతో బోటులోని తొమ్మిది మంది మత్స్యకారులు అలల ఉధృతిలో గల్లంతయ్యారు.

గల్లంతైన మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు, పడవల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.

ప్రమాద తీవ్రతను దృష్ట్యా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిళనాడు విపత్తు నిర్వహణ, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడారు. తమిళనాడు అధికారులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. చట్టపరమైన ప్రక్రియలు, పోస్ట్‌మార్టం పూర్తి కాగానే మృతదేహాలను తమిళనాడు అధికారులకు అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

తీవ్ర తుపాను మురసు ఈ వారం ప్రారంభంలో నెల్లూరు-నరసాపురం మధ్య, ఒంగోలు సమీపంలో తీరం దాటిన సంగతి తెలిసిందే. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచడంతో తీర ప్రాంతాల్లో వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి తీవ్ర ఆస్తి, పంట నష్టం వాటిల్లింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks