...
...
Next Story

మధ్యప్రదేశ్, పాపికొండల నుంచి నల్లమలలోకి 120 అడవి దున్నలు!

నల్లమల అడవుల్లో మళ్లీ అడవి దున్నలు సందడి చేయనున్నాయి. ఈ మేరకు అటవీ శాఖ వాటిని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది.

Published on: Jan 29, 2026, 11:46:02 IST
Advertisement

వన్యప్రాణుల పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ కీలక అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ కింద ఉన్న నల్లమల అడవులలో అంతరించిపోతున్న అడవి దున్న (ఇండియన్ గౌర్) తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ ప్రాజెక్టు ఓకే అయితే దాదాపు 160 సంవత్సరాల కిందట నల్లమలలో సందడి చేసిన అడవి దున్నలు మళ్లీ తిరగనున్నాయి. నల్లమల ప్రాంతానికి ఈ గంభీరమైన జాతి తిరిగి వస్తే ఆకర్శణగా ఉండనుంది. జీవవైవిధ్యానికి పుట్టినిల్లు నల్లమల. ఇటీవల దట్టమైన నల్లమల అడవులలో ఒంటరి మగ అడవి దున్న చూసిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

జూలై 2024లో నంద్యాల జిల్లాలోని ఆత్మకూర్ నల్లమల అటవీ విభాగంలో ఈ జంతువు నాలుగు నుండి ఆరు సార్లు కనిపించింది. జూలై, అక్టోబర్ 2024 మధ్య సాధారణ పర్యవేక్షణలో బైర్లూటి, ఆత్మకూర్, వెలుగోడు అటవీ శ్రేణులలో అటవీ సిబ్బంది అడవి దున్నను గుర్తించారు. అధికారుల ప్రకారం దాదాపు 10 సంవత్సరాల వయస్సు గల ఈ దున్న కృష్ణా నదిని దాటి వందల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కర్ణాటక అటవీ ఘాట్‌ల నుండి వలస వచ్చి నల్లమలకు చేరుకుందని అంచనా వేస్తున్నారు.

ఇది ఒంటరిగా రావొచ్చు లేదంటే.. మరిన్ని అడవి దున్నలు నల్లమలకు తరలివస్తున్నాయని సూచించవచ్చని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి దాని కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు అటవీ అధికారులు. వందేళ్ల కిందట నల్లమలలో అడవి దున్నలు విపరీతంగా ఉండేవి. కానీ తరువాత వాటి ఆవాసాలకు నష్టం, మానవ కార్యకలాపాల కారణంగా అడవి దున్నలు కనుమరుగయ్యాయి.

ప్రస్తుతం ఇవి సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, అరకు అటవీ విభాగాలలో కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే వీటిని నల్లమలలోకి పునఃప్రవేశపెట్టేందుకు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది.

నిష్పత్తి ప్రకారం లెక్కలు వేసుకుని.. 120 మగ, ఆడ అడవి దున్నలను ప్రవేశపెట్టనున్నారు. వీటిని విడతలవారీగా తీసుకువస్తారు. ముందుగా వాటిని ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. నల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. 2,444 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రధాన పులుల నివాస స్థలం ఉంది. అడవి దున్నలను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల అటవీ పర్యావరణ వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe