అడవి తల్లి అస్తిత్వ ఆవిష్కారం: చెంచుల జీవన ప్రతిబింబం ‘కొండమల్లు’
సీనియర్ జర్నలిస్టు, రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రాసిన కొండమల్లు పుస్తకాన్ని పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు.
హైదరాబాద్: అక్షరం అడవి పువ్వు పరిమళాన్ని అద్దుకుంటే.. కలం గిరిజన గుండె చప్పుడై మోగితే.. అది ‘కొండమల్లు’ అవుతుంది. 12వ శతాబ్దపు చెంచుల వీరత్వాన్ని, వారి సామాజిక సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేస్తూ రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన ‘కొండమల్లు’ నవల సాహిత్య లోకంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నాడు ఈ నవలా ఆవిష్కరణోత్సవం కన్నుల పండువగా సాగింది.

నవలలో సామాన్యుడే కథానాయకుడు కావాలి
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు నవలను ఆవిష్కరించి ప్రసంగించారు. "సాధారణంగా నవలలు రాజుల వైభవం, రాజ్యకాంక్ష, యుద్ధాల చుట్టూ తిరుగుతాయి. కానీ, అట్టడుగున ఉన్న గిరిజన సామాజిక జీవన చిత్రణను ప్రధాన ఇతివృత్తంగా తీసుకోవడం గొప్ప విషయం. వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన మూడు పుస్తకాలను నేనే ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘కొండమల్లు’ ద్వారా చెంచుల సంస్కృతి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది" అని ఆయన కొనియాడారు.
గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, వెంకటేశ్వర్లు రాసిన ‘మరణం అంచున’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంలోనే చెంచుల భూ సమస్యలు తన దృష్టికి వచ్చాయని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో 1600 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారి అస్తిత్వాన్ని కాపాడామని హరీష్‌రావు గుర్తుచేశారు. ‘పిట్ట వాలిన చెట్టు’ నవలలో తెలంగాణ పచ్చదనాన్ని వర్ణించిన తీరును కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
నిజమైన ఆధ్యాత్మిక వేత్తలు చెంచులు: ప్రజాకవి గోరటి వెంకన్న
ప్రముఖ ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. "నాకు నవలలు అంత త్వరగా నచ్చవు, కానీ ‘కొండమల్లు’ నన్ను కట్టిపడేసింది. అడవిలో ఏ కల్మషం లేకుండా బతికే చెంచులు నిజమైన ఆధ్యాత్మిక వేత్తలు. ఎక్కడా విసుగు లేకుండా, ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఒక ఆదివాసీని నవలా నాయకుడిగా నిలబెట్టడం వెంకటేశ్వర్లు సాహిత్య పటిమకు నిదర్శనం" అని అన్నారు.
చరిత్రకు ప్రాణం పోసిన అక్షర సేద్యం
ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి మాట్లాడుతూ, ఈ నవల 12వ శతాబ్దపు కథనైనా నేటి వర్తమాన పరిస్థితులకు, ముఖ్యంగా రాయలసీమ జీవన చిత్రణకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. కాకతీయుల చరిత్రపై వెంకటేశ్వర్లు గారు త్వరలో తీసుకురాబోయే నవల కోసం సాహిత్య లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.
మరో ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ఈ నవలను ఒక ‘దృశ్య కావ్యం’గా అభివర్ణించారు. 12వ శతాబ్దపు చెంచుల ఆహారపు అలవాట్లు, వేట, వారి పోరాట పటిమను కళ్లకు కట్టినట్లు చూపించారని, పల్నాటి బ్రహ్మనాయుడి కాలంలో ఒక సామాన్య ఆదివాసీని హీరోగా చేయడం గొప్ప సాహసమని కొనియాడారు.
సాహితీ ప్రముఖుల ప్రశంసల జల్లు
సీనియర్ ఎడిటర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణలో నవలాకారుల కొరతను వెంకటేశ్వర్లు తీరుస్తున్నారని, ఆంధ్రా చరిత్రను తెలంగాణ మాండలికంలో రాయడం ఒక అద్భుత ప్రయోగమని అన్నారు. ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ, బీఆర్ఏఓయూ వైస్ ఛాన్సులర్ ఘంటా చక్రపాణి వెంకటేశ్వర్లు కృషిని అభినందించారు. చరిత్రకారులు విస్మరించిన కోణాలను ‘కొండమల్లు’ వెలుగులోకి తెచ్చిందని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ, కవి జూలూరి గౌరిశంకర్, సీనియర్ ఎడిటర్ వర్ధెల్లి మురళి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


