Srisailam Free Bus Service : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు నెల రోజుల పాటు క్షేత్ర పరిధిలో ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈవో) యం. శ్రీనివాసరావు సంయుక్తంగా వెల్లడించారు.
బస్సు మార్గాలు ఇలా...

కార్తీక మాసంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవి దర్శనార్థం శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రవాణా ఏర్పాట్లు చేశారు. పాతాళగంగ మెట్లమార్గం నుంచి ప్రారంభమయ్యే ఈ ఉచిత బస్సులు నందిసర్కిల్, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్ మీదుగా నేరుగా లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్ల వరకు నడుస్తాయి.
సమయ వేళలు…..
భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచే ఈ ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయి. రాత్రి 9:00 గంటల వరకు నిరంతరాయంగా ఈ బస్సులు తిరుగుతాయి. క్షేత్రానికి వచ్చే భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని…. స్వామివారి దర్శనాన్ని సులభంగా చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు.
కార్తీక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి శ్రీశైలానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఆలయ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వీఐపీల కంటే సామాన్య భక్తులకు త్వరితగతిన, సులభంగా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఆలయ దర్శన వేళలు, సేవల్లో కీలక మార్పులు ప్రకటించారు.
- శని, ఆది, సోమవారాల్లో విపరీతమైన భక్తుల రద్దీ ఉండే రోజుల్లో కేవలం అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- సామాన్య భక్తుల దర్శన వేళలకు అంతరాయం కలగకుండా నెల రోజుల పాటు పలు ఆర్జిత సేవలను దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. రద్దీ రోజుల్లో నిర్వహించే రూ.5,000 గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 సామూహిక అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు.
- ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవల టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
- అమ్మవారి అంతరాలయంలో జరిగే రూ.1,000 కుంకుమార్చన సేవను భక్తుల సౌకర్యార్థం ఆశీర్వచన మండపంలో నిర్వహించనున్నారు.
- ఆలయంలో జరిగే ఆర్జిత హోమాలు, నిత్య కళ్యాణోత్సవ సేవలు ఎలాంటి మార్పులు లేకుండా నిర్దేశిత సమయాల్లో కొనసాగుతాయి.
- ఏపీటీఎస్ అధికారిక వెబ్‌సైట్: www.tms.ap.gov.in ద్వారా లేదంటే.. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా టికెట్లను సులభంగా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.