...
...
Next Story

గ్రామ సచివాలయాలపై క్షేత్రస్థాయి నివేదిక.. షాకింగ్ నిజాలు, బయటపడ్డ లోపాలు!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాలు ప్రమాదంలో పడ్డాయని పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ వెల్లడించింది. క్షేత్రస్థాయి అధ్యయనంలో వైఫల్యాలు ఉన్నాయని, పలు సూచనలు చేసింది.

Published on: Feb 23, 2026, 19:21:34 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ క్షేత్రస్థాయి సర్వే చేసింది. ఈ మేరకు కొన్ని విషయాలను పంచుకుంది. 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 20 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనం ఉత్తరాన ఇచ్ఛాపురం నుండి దక్షిణాన తడ వరకు తీర ప్రాంత గ్రామాలు, రాయలసీమ జిల్లాలు, మారుమూల గిరిజన తండాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పరిశోధనా బృందం సచివాలయ సిబ్బంది, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, లబ్ధిదారులు, సామాన్య పౌరులతో సహా 1,200 మందికి పైగా భాగస్వాములతో ముఖాముఖి నిర్వహించింది. ప్రాథమిక సమాచారం, రికార్డుల పరిశీలన, లోతైన ఇంటర్వ్యూల ఆధారంగా నివేదిక పిపుల్స్ పల్స్ నివేదిక తయారుచేసింది. 2019లో గొప్ప ఆశలతో ప్రారంభమైన గ్రామ సచివాలయాలపై నిష్పాక్షికమైన, పారదర్శకమైన అంచనాను అందిస్తుంది.

వాగ్దానం వర్సెస్ క్షేత్రస్థాయి వాస్తవికత

మహాత్మా గాంధీ ఆశయమైన గ్రామ స్వరాజ్య సాధనలో గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ ఒక విప్లవాత్మక అడుగుగా భావించారు. బహుళ శాఖల పరిపాలనను ప్రజల ఇంటి వద్దకే తీసుకురావడం, సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, స్థానిక ఉపాధి కల్పన, గ్రామ సభలు, పంచాయతీ రాజ్ సంస్థలకు పాలనను జవాబుదారీగా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

ప్రారంభంలో ఈ వ్యవస్థ స్పష్టమైన ప్రయోజనాలను అందించింది. 15,000 పైగా సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఇందులో 1.34 లక్షల మందికి పైగా సిబ్బంది, 2.52 లక్షల మంది వాలంటీర్లు పనిచేశారు. పెన్షన్లు నేరుగా ఇంటికే అందాయి, సర్టిఫికేట్లు వేగంగా జారీ అయ్యాయి. అనేకమంది గ్రామీణ యువతకు ప్రభుత్వ అనుబంధ ఉద్యోగాలు లభించాయి. మొదటి రెండు మూడు ఏళ్ల పాటు ఈ వ్యవస్థ విస్తృత ప్రజాదరణ పొందింది. సర్వే ప్రకారం ఈ వ్యవస్థ క్రమంగా బలహీనపడింది.

సిబ్బందిపై ఒత్తిడి, మానసిక ఆరోగ్య సంక్షోభం

2024లో వాలంటీర్ వ్యవస్థను హఠాత్తుగా రద్దు చేయడం వల్ల చివరి మైలు వరకు సేవలు అందించడంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకప్పుడు ఇంటికే వచ్చే పెన్షన్లు, దరఖాస్తుల కోసం ఇప్పుడు పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది, ఇది జాప్యానికి మరియు అసౌకర్యానికి కారణమవుతోంది.

పౌరుల అసంతృప్తి

హామీ ఇచ్చిన 72 గంటల పరిష్కార గడువు ఎక్కడా అమలు కావడం లేదు. సచివాలయాలు సమస్యల పరిష్కార కేంద్రాలుగా కాకుండా కేవలం దరఖాస్తుల సేకరణ కేంద్రాలుగా మిగిలిపోయాయి. గ్రామీణ ప్రజలు తమ సమస్యల కోసం తరచూ జిల్లా కలెక్టరేట్లు లేదా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్‌లను ఆశ్రయిస్తున్నారు.

రాజకీయ ఉదాసీనత

  • ఎన్నికైన ప్రతినిధులు తమను పక్కన పెట్టినట్లు భావిస్తున్నారు. సచివాలయాలు తమకు సహకరించే సంస్థలుగా కాకుండా, సమాంతర అధికార కేంద్రాలుగా మారాయని వారు పేర్కొంటున్నారు. గ్రామసభ నిర్ణయాలు ఆచరణలోకి రావడం లేదు.

ఆర్థిక భారం

  • ఈ వ్యవస్థ ఒక తెల్ల ఏనుగుగా మారింది. వేల కోట్ల రూపాయలు జీతాలు, నిర్వహణ కోసం ఖర్చవుతున్నా, ఫలితాలు మాత్రం క్షీణిస్తున్నాయి.

మౌలిక సదుపాయాల లోపాలు

  • అనేక సచివాలయాలు జీరో-బడ్జెట్ మోడల్‌లో నడుస్తున్నాయి. నిరీక్షణ గదులు, తాగునీరు, సరైన పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయి.

ప్రభుత్వానికి స్పష్టమైన సిఫార్సులు

  • దీనిని రాజకీయ ఘర్షణగా కాకుండా, అర్థవంతమైన సంస్కరణలకు ఒక అవకాశంగా పరిగణించాలని పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ క్రింది నిర్దిష్టమైన, ఆచరణాత్మక సిఫార్సులను అందిస్తోంది:

ఉన్నత స్థాయి స్వతంత్ర అధ్యయన కమిటీ

  • రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన 15 రోజుల్లోగా కమిటీని ఏర్పాటు చేయాలి. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, పౌర సమాజం, మేధావులు మరియు పరిశోధకులకు ప్రాతినిధ్యం ఉండాలి. ఈ కమిటీ మూడు నెలల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలి.

మానవీయ కోణంలో సిబ్బంది హేతుబద్ధీకరణ

  • జనాభా ప్రాతిపదికన సిబ్బంది సర్దుబాటును(A, B, C కేటగిరీలు) పూర్తి చేయాలి. అదనపు సిబ్బందిని నైపుణ్య పరీక్షల ద్వారా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలి, ఎవరినీ తొలగించకూడదు.

రాజకీయ రహిత వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణ

  • ఒక తటస్థ నియామక సంస్థ ద్వారా పరిమిత సంఖ్యలో వాలంటీర్లను(ప్రతి 100 ఇళ్లకు ఒకరు) నియమించాలి. వారికి రూ. 10,000 గౌరవ వేతనం, స్పష్టమైన విధులు, కఠినమైన పనితీరు పర్యవేక్షణ ఉండాలి.

సిబ్బంది సంక్షేమం

  • పని వేళల్లో వెసులుబాటు, జిల్లా స్థాయిలో రహస్య కౌన్సెలింగ్ సేవలు, అర్హత ఆధారిత ప్రమోషన్లు, మహిళా సిబ్బందికి రక్షణ ప్రోటోకాల్స్ ప్రవేశపెట్టాలి. 8 గంటల పని దినాన్ని కచ్చితంగా అమలు చేస్తూ, అదనపు పనికి తగిన పరిహారం చెల్లించాలి.

పంచాయతీ రాజ్ సంస్థలతో అనుసంధానం

  • సచివాలయ సిబ్బందిని గ్రామసభలకు మరియు ఎన్నికైన ప్రతినిధులకు జవాబుదారీగా చేయాలి. సర్పంచులు, వార్డు సభ్యులకు రోజువారీ విధుల్లో స్పష్టమైన పర్యవేక్షణ అధికారాలు ఉండాలి.

మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థల ఆధునీకరణ

  • MGNREGA మరియు ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా అన్ని కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. ఏకీకృత సర్వేలు, ఫిర్యాదుల ట్రాకింగ్, నిధుల వినియోగం కోసం ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అమలు చేయాలి.

గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

  • ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, తక్కువ అవగాహన ఉన్న ప్రజలకు సేవలందించేందుకు హ్యామ్లెట్ స్థాయిలో 'మల్టీ పర్పస్ అసిస్టెంట్లతో' కూడిన ప్రత్యేక నమూనాను రూపొందించాలి.

సమగ్ర సర్వే విధానం

  • ప్రతి శాఖ విడివిడిగా చేసే సర్వేల స్థానంలో, ఏడాదికి ఒకసారి మాత్రమే ఓటీపీ ఆధారిత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలి. ఈ డేటాను అన్ని శాఖలు వాడుకునేలా చూడాలి.

'గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలనే సంకల్పంతో గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. మా సర్వే ప్రకారం, లక్ష్యం సరైనదే అయినప్పటికీ, అమలులో తీవ్ర లోపాలు ఉన్నాయి. పారదర్శకమైన, ఏకాభిప్రాయంతో కూడిన సంస్కరణల ద్వారా తప్పులను సరిదిద్దడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. వీటిని విస్మరిస్తే ప్రజాధనం వృథా కావడమే కాకుండా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ, పట్టణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం త్వరగా, నిర్ణయాత్మకంగా స్పందించాలని మేం కోరుతున్నాం.' అని పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ ఆర్.దిలీప్ రెడ్డి పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe