దారితప్పిన సచివాలయ వ్యవస్థకు దిక్కేది? పర్యవేక్షణ లోపమా? నిధుల కొరతా?

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరు పరిశీలనకు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. ఈ వ్యవస్థ అవసరాన్ని ఆ సంస్థ నొక్కి చెబుతోంది.

Published on: Feb 12, 2026, 12:00:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉన్నత ఆశయాలు, ఉదాత్త లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ దారితప్పింది. తాజా దుస్థితిని ఇలాగే అనుమతిస్తే ఆర్థిక భారంతో పాటు మరిన్ని విపరిణామాలకు దారి తీసే ప్రమాదముంది. లోతుగా సమీక్షించి, తప్పిదాలను వెంటనే సరిదిద్దితే తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. సంకుచిత రాజకీయ దృష్టి కోణంలో కాకుండా గ్రామస్వరాజ్య స్ఫూర్తితో సంస్కరణలు చేపట్టాలి. విస్తృత‌, ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, సిఫారసులను నిజాయితీగా అమలు చేయాలి. పాలన వికేంద్రీకరణ, సేవల విస్తరణ, పథకాల్లో పారదర్శకత, సమస్యల పరిష్కారం అన్న బహుముఖ లక్ష్యాల సాధనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం కట్టుబడాలి.

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై సర్వే
ఆంధ్రప్రదేశ్‌ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరు పరిశీలనకు ‘పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ బృందాలు ఉత్తరాన ఇచ్ఛాపురం నుంచి దక్షిణాన తడ వరకు గ్రామాలు, వార్డులను కలయ తిరుగుతూ విస్తృత‌ క్షేత్ర సర్వే నిర్వహించింది. సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, సాధారణ పౌరులతో ప్రత్యక్షంగా మాట్లాడి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ విశ్లేషణ రూపొందింది.

గ్రామ స్థాయిలో అన్ని సేవలే లక్ష్యంగా

2019 వేసవిలో గాంధీజయంతి సందర్భంగా ప్రారంభమైన గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ ఒక పరిపాలనా సంస్కరణ మాత్రమే కాదు సమూల మార్పుకు నాంది అని భావించారు. గ్రామ స్వరాజ్యాన్ని భారత ప్రజాస్వామ్యానికి ఆత్మగా చూసిన మహాత్మా గాంధీ ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది ఈ వ్యవస్థ. గ్రామ స్థాయిలోనే అన్ని సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పడింది. ప్రతి కడపకు బహుళ విభాగాల సిబ్బంది, వాలంటీర్లను తీసుకువచ్చి సంక్షేమ పథకాలను, ముఖ్యంగా నాటి ప్రభుత్వం చేపట్టిన ‘నవరత్నాల’ను పారదర్శకంగా అమలు చేయడం, సమస్యల్ని వేగంగా పరిష్కరించడం, ‘గ్రామసభ’ కేంద్రకంగా బాధ్యతాయుత పాలనను నిర్మించడం ప్రధాన ఉద్దేశం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు, భూమిలేని వారు, అట్టడుగు వర్గాల కోసం ఇది గౌరవం, సమానత్వం, న్యాయం అనే వాగ్దానంగా కనిపించింది.

ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధి

ప్రారంభ ప్రణాళిక సమగ్రంగా మంచి ఉద్దేశాలతో రూపొందింది. కేరళ పంచాయతీరాజ్ నమూనా నుంచి కొంత స్ఫూర్తి పొందిన ఈ వ్యవస్థలో మొదట ప్రతి సచివాలయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మల్టీపర్పస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌తో సహా 14 మంది సిబ్బంది ఉండాలని భావించినా, చివరికి 11 మందికి పరిమితం చేశారు. నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం పొందే వాలంటీర్లు ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే వ్యవస్థ ప్రత్యేకం! ఇంటింటికీ పెన్షన్లు అందించడం, దరఖాస్తులు సేకరించడం, పథకాలపై అవగాహన కల్పించడం వంటి బాధ్యతలతో మెుదలైంది.

ఈ వ్యవస్థపై నిర్లక్ష్యం

కేంద్ర పథకాలైన 14వ ఆర్థిక సంఘం నిధులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన జరగాల్సి ఉంది. రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాలపై పంచాయతీరాజ్ సంస్థలకు అధికారం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఆరు సంవత్సరాల తర్వాత ఈ వ్యవస్థ కీలక మలుపు వద్ద నిలిచింది. 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి వరకు నిర్వహించిన ఫీల్డ్ సర్వే ప్రకారం, ఈ వ్యవస్థ తన ప్రాథమిక లక్ష్యాల నుంచి దూరమైందని స్పష్టమౌతోంది. ప్రజల ఆశలతో ప్రారంభమైన కార్యక్రమం క్రమంగా నిర్లక్ష్యం, అసమర్థత, నిరుత్సాహం, అమలు స్థబ్దత వైపు జారిపోతోంది.

వికేంద్రీకరణ ఎక్కువగా పేరుకే పరిమితమౌతోంది. పంచాయతీరాజ్ సంస్థలతో కలిసి పనిచేయాల్సిన సచివాలయాలు అనేక చోట్ల సమాంతర వ్యవస్థలుగా మారి, ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పాత్రను తగ్గిస్తున్నాయి. “ఈ వ్యవస్థలో మా స్థానం ఏమిటి?” అని మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, గ్రామ సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయ సిబ్బంది గ్రామ సభలకు హాజరు కావాలని, అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం కావాలని, వార్షిక-అయిదేళ్ల కార్యాచరణ రూపొందించాలని ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు అమలులో కనిపించడంలేదు. దీంతో ప్రజాప్రతినిధులు అమలు ప్రక్రియ నుంచి వేరుపడుతున్నారు.

ప్రతిభ వృథా అనే భావన

ఈ వ్యవస్థలో మానవ వనరుల నిర్వహణ వ్యయం మరింత ఆందోళన కలిగిస్తోంది. రెగ్యులరైజేషన్ తర్వాత లక్షా పది వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. వారిలో చాలామంది డిగ్రీలు, పీజీలతో పాటు సోషల్ వర్క్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీలు చేసిన ఉన్నత విద్యావంతులు. అయినప్పటికీ పాఠశాల మరుగుదొడ్ల ఫోటోలు తీయడం, వైన్ షాపులకు జియోట్యాగింగ్ చేయడం వంటి పనులు అప్పగించడంతో తమ ప్రతిభ వృథా అవుతోందని వారు భావిస్తున్నారు. 2024లో తదనంతరం వాలంటీర్ వ్యవస్థ ఉన్నపళంగా రద్దవడంతో ఇంటింటికీ సేవలు అందించే బాధ్యతలు, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సిబ్బందిపై పడిపోయాయి.

ఉద్యోగుల్లో ఆందోళన

వారానికి 48 గంటలకు మించి పని, దూరప్రాంతాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు సమస్యలు, జీతం కోతల భయం, ప్రమోషన్లు-ఇంక్రిమెంట్లు లేకపోవడం.... ఇలాంటివి ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతున్నాయి. యునైటెడ్ ఫ్యామిలీ కార్డ్ అప్‌డేట్లు, బయోమెట్రిక్ ధృవీకరణలు, ఈకేవైసీ, కుటుంబ వలసల ట్రాకింగ్ వంటి అంతులేని సర్వేలు ప్రధాన సేవలను పక్కకు నెడుతున్నాయి. “పర్యవేక్షకులు చాలామంది ఉన్నారు, కానీ నిజమైన మార్గదర్శకత్వం లేదు” అని సిబ్బంది వాపోతున్నారు. నియంత్రణ-నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. లైన్ అధికారుల ఒత్తిడి, రాజకీయ జోక్యం స్వాతంత్య్రాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి.

ఉద్యోగులపై ఒత్తిడి

ఉద్యోగులపై నిరంతర ఒత్తిడి వారి మానసిక, శారీరక ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తోంది. 2025లోనే సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్యలో, ఆకస్మిక మరణాలో నమోదయ్యాయి. మొత్తంగా 61 మంది చనిపోయినట్టు ధృవీకరణ కాని సమాచారం ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. మహిళా పోలీస్ అసిస్టెంట్లు రాత్రి విధుల నుంచి మినహాయింపు, ప్రమోషన్ అవకాశాలు కోరుతున్నారు. సర్వేయర్లు ఆధునిక పరికరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అనేక విభాగాల బాధ్యతలు చేపట్టి, నాణ్యత లోపాల పేరుతో మెమోలు, సస్పెన్షన్లు ఎదుర్కొంటున్నారు.

కేవలం దరఖాస్తులు మాత్రమే

సంక్షేమ కార్యదర్శులు తమ నైపుణ్యానికి సంబంధించిన పనులకంటే ఇతర సర్వేలకు మళ్లించబడుతున్నారు. అంతిమంగా ఆ ప్రభావం ప్రజలపైనే పడుతోంది. 72 గంటల్లో సమస్య పరిష్కారం అనే లక్ష్యం ఆశగానే మిగులుతోంది. సచివాలయాలు సమస్యలను పరిష్కరించే కేంద్రాల కంటే దరఖాస్తులు స్వీకరించే కౌంటర్లుగా మారుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. సర్టిఫికెట్లు, భూ సర్వేలు, సబ్సిడీలు, పథకాల కోసం ప్రజలు ఆలస్యాలతో ఇబ్బందులు పడుతూ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ లేదా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్‌ను ఆశ్రయిస్తున్నారు.

కార్యాలయాలకు పౌరులు

ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో సచివాలయాల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్న పెదలబుడు గ్రామంలో సిబ్బంది హాజరు లోపం, 15 లక్షల రూపాయలతో నిర్మించిన లైబ్రరీ వినియోగం లేకపోవడం, కనెక్టివిటీ సమస్యలు ప్రజల్లో నిరాశను పెంచుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఇంటికి వచ్చే పెన్షన్ల కోసమో, ఇతర అవసరాలకో పౌరులు ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం వారి నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఆర్థికంగా కూడా ఈ వ్యవస్థ “తెల్ల ఏనుగు”గా మారుతోందనే విమర్శలున్నాయి.

జీతాలు, అలవెన్సులు, నిర్వహణ ఖర్చులు వేల కోట్లు అయినప్పటికీ ఫలితాలు ఆ నిష్పత్తిలో కనిపించడం లేదు. జనాభా ఆధారంగా పంచాయతీల వర్గీకరణ జరుగుతున్నా, అధిక సిబ్బందిని సరైన విభాగాలకు మళ్లించాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ వర్క్స్, రెవెన్యూ, సామాజిక సంక్షేమ వంటి విభాగాల్లో ఖాళీలకు అనుగుణంగా నైపుణ్యాల మ్యాపింగ్, శిక్షణ ద్వారా ఉద్యోగుల సేవల్ని సమర్థంగా పునర్వినియోగం చేయవచ్చు.

ఈ పరిస్థితికి మూల కారణాలు ప్రారంభ దశలో పైలట్ పరీక్షలు లేకపోవడం, సమన్వయ లోపం, 2024 తర్వాత తీసుకున్న మార్పులకు సమగ్ర వ్యూహం లేకపోవడమే! వరుస ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పించుకోజాలవు. ఒకటి లోపభూయిష్ట అమలయితే మరొకటి స్పష్టతలేని సవరణలు.

ఫోకస్ చేయాల్సిందే!

ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా తక్షణ చర్య అవసరం. కనీసం పదవీ విరమణ చేసిన చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి అధ్యక్షతన అన్ని పార్టీల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, పౌర సమాజం సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. సచివాలయాలను పంచాయతీరాజ్ సంస్థలతో పూర్తిగా అనుసంధానించి గ్రామ సభలకు సంయుక్త బాధ్యత కల్పించాలి. పర్యవేక్షణ, నివేదిక వ్యవస్థలను స్పష్టంగా నిర్వచించాలి. సర్వవిధ కుటుంబ డేటాతో సమగ్ర సర్వే విధానం అమలు చేయాలి.

పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక విద్యా సహాయకులను నియమించాలి. ప్రతి కార్యాలయానికి కనీస సౌకర్యాలు కల్పించాలి; గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక నమూనాలు రూపొందించాలి. రాజకీయ ప్రభావం లేకుండా పరిమిత స్థాయిలో వాలంటీర్లను పునరుద్ధరించాలి. జనాభా ఆధారంగా సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేసి, అధిక సిబ్బందిని ఇతర విభాగాలకు మళ్లించాలి. ఉద్యోగుల డిమాండ్లైన సౌకర్యవంతమైన పని వేళలు, గోప్యమైన మానసిక ఆరోగ్య సలహాలు, ప్రమోషన్ మార్గాలు, ఆధునిక పరికరాలు, భద్రతా ప్రమాణాలను అమలు చేయాలి.

ఈ వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం పరిపాలనా అవసరం మాత్రమే కాదు! పాలనా వికేంద్రీకరణతో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక న్యాయానికి ఇదెంతో కీలకం. ఆధారపూర్వక, సమగ్ర సంస్కరణలతో గ్రామ స్వరాజ్య వాగ్దానాన్ని తిరిగి సాధించవచ్చు. శక్తివంతమైన గ్రామాలు, పారదర్శక సంక్షేమం, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం. గాంధీజీ చెప్పినట్లే, నిజమైన స్వాతంత్య్రం గ్రామ పునాదుల నుంచి మొదలవుతుంది. సవ్యమైన ‘సచివాలయ వ్యవస్థ’ ద్వారా మాత్రమే ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు కట్టుబడే ప్రజాస్వామ్యం వస్తుంది.

దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More