తెలుగు రాష్ట్రాల్లో ఏ పల్లెకు వెళ్లినా ప్రజలు ముందుగా చెప్పే సమస్యల్లో భూములకు సంబంధించిన వివాదాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. తెలుగు గడ్డపై గత మూడు దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారినా, భూముల సమస్యలకు మాత్రం శాశ్వత పరిష్కారం దొరకడంలేదు. పాలకులు మారుతున్నారు, విధానాలు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి. కానీ రైతుల భూములకు సంబంధించి సమస్య తీరకపోగా కొత్త సమస్యలు పుట్టుకురావడం దురదృష్టకరం.
వాస్తవ పరిస్థితి వేరు

ఆధునిక సాంకేతికతతో భూముల వివరాల డిజిటలైజేషన్ ప్రారంభించిన తర్వాత భూ రికార్డుల్లో పారదర్శకత పెరుగుతుందని రైతులు భావించారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఇబ్బందులు పెరిగి చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా నష్టపోయినట్లు అనేక గ్రామాల్లో వినిపిస్తున్న అభిప్రాయం. భూ రికార్డుల్లో తప్పులు, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, రాజకీయ నాయకుల జోక్యం కలిసి సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. తెలంగాణలో ధరణీ పోర్టల్, భూ భారతి ప్రవేశపెట్టడం, ఆంధ్రప్రదేశ్‌లో రీసర్వే చేపట్టడం తర్వాత సమస్యలకు పరిష్కారం లభించే బదులు అనేక కొత్త వివాదాలకు దారితీసిందని రెండు రాష్ట్రాల రైతులు చెబుతున్నారు.
అనేక సమస్యలు
పలు గ్రామాల్లో పీపుల్స్ పల్స్ బృందం పర్యటించినప్పుడు రైతులు వెల్లడించిన వివరాల ప్రకారం భూమి లేని వారి పేర్లపై భూములు నమోదు కావడం, కొందరికి ఉన్నదాని కంటే ఎక్కువ విస్తీర్ణం నమోదు కావడం, మరికొందరికి తక్కువగా నమోదు కావడం వంటి సమస్యలు చోటుచేసుకున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. డిజిటల్ రికార్డుల్లో ఈ వివరాలు నమోదవడంతో గ్రామాల్లో కొత్త వివాదాలు చెలరేగిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వివాదాల్లో భాగంగా సొంత కుటుంబ సభ్యుల మధ్య కక్షలు పెరుగుతున్నాయి.
ఆఫీసుల చుట్టూ తిరగాలి
రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉన్న కొందరు తమ సమస్యలను త్వరగా పరిష్కరించుకోగలుగుతున్నారని, అయితే సాధారణ రైతులు మాత్రం నెలలు, సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. ఈ భూ వివాదాల కారణంగా కుటుంబాల్లో కొందరి రైతుల కుమార్తెల వివాహాలు కూడా వాయిదా పడిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
బెస్ట్ ఎగ్జాంపుల్
{{/usCountry}}రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉన్న కొందరు తమ సమస్యలను త్వరగా పరిష్కరించుకోగలుగుతున్నారని, అయితే సాధారణ రైతులు మాత్రం నెలలు, సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. ఈ భూ వివాదాల కారణంగా కుటుంబాల్లో కొందరి రైతుల కుమార్తెల వివాహాలు కూడా వాయిదా పడిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
బెస్ట్ ఎగ్జాంపుల్
{{/usCountry}}ఉదాహరణకి పీపుల్స్ పల్స్ బృందం ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడిన సమయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఆ గ్రామంలోని ఓ రైతు తమ కుమార్తె వివాహం కోసం తన భూమిని అమ్ముకుందామనుకున్నాడు. కానీ అప్పటికే జరిగిన రీ సర్వేలో తనకు ఉండాల్సిన భూమి కన్నా ఎక్కువ భూమి ఆ రైతు పేరిట నమోదు కావటంతో వారి రిజిస్ట్రేషన్ ఆపివేశారు. దానితో రైతు దాన్ని సరిదిద్దటానికి నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవటంతో భూమిని అమ్ముకోలేక చివరికి కూతురి పెళ్లి వాయిదా వేసుకున్నాడు.
అదే విధంగా మరో గ్రామంలో కూడా రైతుకు ఉండాల్సిన భూమి కన్నా తక్కువ నమోదు కావటంతో కుమారుడు చదువు కోసం అమ్ముకొందమ్మన్నా, ఇటు భూమి అమ్ముకోలేక అటు అప్పు పుట్టక మధ్యలోనే చదువు ఆపివేయాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదనతో చెప్పారు. అధికారుల అలసత్వం, జవాబు దారితనం లేకపోవటం వలన జరిగిన ఈ నష్టాన్ని తీర్చేవారు ఎవరు? ఇలాంటి ఉదాహరణలు రెండు రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో కనిపించటం సమస్య తీవ్రతను సూచిస్తోంది.
హామీలు ఎన్నికల వరకే
ఎన్నికల సమయంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వారు సమస్య మూలాలను పరిష్కరించే ప్రయత్నం కంటే రీ-సర్వేలు, డిజిటలైజేషన్, రెవెన్యూ సదస్సులు వంటి పేర్లతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే వీటితో పరిష్కారాలు లభించే బదులు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని రైతన్నలు వాపోతున్నారు.
అశోక్ గజపతిరాజు భూ సమస్య
విజయనగరం సంస్థానానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్ గజపతిరాజుకు సంబంధించిన భూమి విషయంలోనూ వివాదం తెరపైకి వచ్చింది. ఆయనకు సంబంధించిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపి, ఒక పార్టీ వారి కార్యాలయం నిర్మించుకోవడానికి లీజుకు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి అప్పటి అధికారులు ఆయనకు తెలియకుండానే నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆయనకు సమాచారం ఇవ్వకుండానే పేపర్ల మీద ఇచ్చినట్లుగా చూపిస్తూ ప్రయివేట్ భూమిని ప్రభుత్వ భూమిగా కన్వర్షన్ చేసి ప్రైవేట్ భూమిని ఒక రాజకీయ పార్టీకి 33 సంవత్సరాల కోసం లీజ్‌కి ఇవ్వటం వేగవంతంగా నెలల వ్యవధిలో జరిగిపోవడం విడ్డూరం. ఆ గవర్నర్ ఈ విషయంపై గత సంవత్సరం కలెక్టర్‌ని 3 సార్లు కలిసి సమస్య చెప్పుకున్నా ఇప్పటి వరకు దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోలేదు. ఆ భూమి ఆయనదా..? కాదా...? అది నిజంగా ప్రభుత్వ భూమా..? అని ఎటూ తేల్చకుండా సంవత్సరం గడిచిపోయింది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికే ఇలాంటి అనుభవం ఎదురైతే ఇక సామాన్యుడి కష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
కలెక్టర్లు ప్రతివారం నిర్వహించే ప్రజా ఫిర్యాదు కార్యక్రమాల్లోనూ, ప్రజాప్రతినిధులకు అందే వినతిపత్రాల్లోనూ గణనీయమైన భాగం భూములకు సంబంధించిన సమస్యలేనని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ సమస్యల మూలకారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం కన్నా, తాత్కాలిక నిర్ణయాలకే ప్రభుత్వాలు పరిమితమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమాధానాలు లేని అనేక ప్రశ్నలు
తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేస్తున్న అ భూమికి రైతులు అప్పటి వరకు శిస్తు కూడా చెల్లిస్తూ ఉంటారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం అప్పటికప్పుడు వాటిని దేవాదాయ భూములు అనో, అసైన్డ్ భూములు అనో, ‘22-ఏ’ అంటూ ఇది మీ భూమి కాదు అని చెప్పటం ఎంత దారుణమో చెప్పటానికి మాటలు రావు. తరాలుగా మా భూములు అనుకొన్న వారికి ఇవి మీ భూములు కావు, వీటిపై మీకు హక్కులు లేవని చెప్పడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్న రైతులకు సమాధానం చెప్పే నాథుడే ఉండడం లేదు. ఎవరిని అడగాలో ఎవరిని కలవాలో తెలియక వారిలో కలిగే ఆవేదన, ఆగ్రహం బాధాకరంగా ఉంటున్నాయి.
కొత్త కొత్త సమస్యలు
రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉందని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో స్వయాన ముఖ్యమంత్రులు కూడా ప్రస్తావిస్తూ రెవెన్యూ శాఖలో పారదర్శకత పెరగాలని, అవినీతి తగ్గాలని వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇటీవల అవినీతిలో దొరుకుతున్న అధికారులు, సిబ్బంది అధికంగా రెవెన్యూ శాఖకు చెందిన వారే అని పత్రికల్లో చూస్తున్నాం. మేము క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు రెవెన్యూ శాఖ గురించి ప్రజలు ప్రస్తావించడం తరచూ మాకు అనుభవంలో ఎదురవుతోంది. రీ-సర్వే అనో మరొకటి అనో ప్రభుత్వం చెప్పగానే పాత సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన రైతులకు, కొత్త సమస్యలు వస్తున్నాయి తప్ప పాత సమస్యలు పరిష్కారం కావటం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. దీనికి తోడు కొత్తగా నియమితులైన సర్వేయర్లకు తగిన అనుభవం, అవగాహన లేకపోవడం కూడా ఈ సమస్యలు పెరగటానికి మరో కారణమని బాధిత రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు భూ సమస్యల పరిష్కారం పేరుతో కొత్త విధానాలు తీసుకొస్తున్నాయి. అయితే వాటిలో చాలా వరకు కొత్త సమస్యలకు దారితీసిన సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పరిష్కారం ఎప్పుడో?
భూమి అనేది రైతుకు కేవలం ఆస్తి కాదు... వారికి అది జీవనాధారం, సెంటిమెంటు. భూ పాస్ బుక్కులపై , సరిహద్దు రాళ్లపై ప్రభుత్వ పెద్దలు తమ ఫోటోలు పెట్టుకోవాలని భావిస్తే ఆ ప్రభుత్వాలనే గద్దెదించిన ఉదంతాలను మనం చూశాం. నక్సలైట్ ఉద్యమాలు కూడా ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించినవే అని చరిత్ర చెబుతోంది. భూ వ్యవహారాల్లో పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం లేకపోతే గ్రామీణ సమాజంలో శాంతి, అభివృద్ధి రెండూ దెబ్బతింటాయి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, పారదర్శక వ్యవస్థ, బాధితులకు వేగవంతమైన న్యాయం, అవినీతిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఈ దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.
గమనిక : ఇది పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా ఇచ్చిన కథనం. ఈ ఆర్టికల్‌కు హెచ్‌టీ తెలుగు బాధ్యత వహించదు.