తిరుమలలో హనుమన్ జయంతి వేడుకలు.. అక్కడకు టీటీడీ ఉచిత రవాణా సౌకర్యం
TTD Hanuman Jayanti : తిరుమలలో హనుమన్ జయంతి వేడుకల కోసం టీటీడీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ తరఫున శ్రీ జపాలి హనుమాన్‌కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 12వ తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడో మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.

తిరుమలలోని జపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరఫున శ్రీ జపాలి హనుమాన్‌కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది.
ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.
టీటీడీ స్థానిక ఆలయాల్లో వేడుకలు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన ఇతర అనుబంధ ఆలయాల్లో మే 12న హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
శరణాగత భక్తికి, అచంచల శ్రీరామ సేవకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతిని టీటీడీ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహనసేవలు నిర్వహించనున్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనుంది.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ సంజీవరాయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీటీడీ కోరింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


