...
...
Next Story

వన్యప్రాణుల సంరక్షణకు 'హనుమాన్'.. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ సిస్టమ్

వన్యప్రాణుల సంరక్షణకు హనుమాన్ ప్రాజెక్టు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.

Published on: Mar 3, 2026, 17:51:11 IST
Advertisement

మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్(హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్) ముందుకు తీసుకొచ్చామన్నారు. ఇటీవల కాలంలో వన్య ప్రాణుల వల్ల పంట, పశు సంపదకి నష్టంతోపాటు మావన భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్నందున ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

ప్రత్యేక వాహనాలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వీటిలో వన్య ప్రాణుల సంరక్షణతోపాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అంబులెన్స్, రెస్క్యూ వాహనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

హనుమాన్ ప్రాజెక్ట్ లక్ష్యం

'హనుమాన్ ప్రాజెక్ట్ మానవ-వన్యప్రాణి మధ్య ఉన్న సంఘర్షణను నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకువెళ్లబోతున్నాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ చేపట్టేలా హనుమాన్ ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు తక్షణ ప్రతిస్పందన, ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వర్తిస్తుంది. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతోపాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అటవీశాఖ హనుమాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది.' అని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రత్యేక శిక్షణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ- వన్యప్రాణి సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం. 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో ఈ తరహా కేసులు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,107 వరకు నమోదు కాగా పరిహారం కింద దాదాపు రూ. 4 కోట్లు చెల్లించామన్నారు. జంతువుల దాడిలో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. గాయపడిన వారికి ఇచ్చే పరిహారం రూ.2 లక్షలు చేశామని తెలిపారు. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

అలర్ట్ సిస్టమ్

'వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో జంతువులు వచ్చే ముందు ముందస్తు హెచ్చరికలు ఇచ్చే విధంగా అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. వన్యప్రాణుల వల్ల మానవ భద్రతకు ముప్పు కలగకుండా హనుమాన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్ట్ కోసం అటవీశాఖ అధికారులు, ఫ్రంట్ లైన్ సిబ్బంది ఎంతో అంకితభావంతో కష్టపడి పని చేశారు.' అని పవన్ కల్యాణ్ అన్నారు.

వన్యప్రాణులకు చికిత్స

వన్యప్రాణులు గాయపడిన సందర్భాల్లో వాటిని తరలించేందుకు వీలుగా పూర్తి స్థాయి సౌకర్యాలతో వాహనాలను సిద్ధం చేశారు. వీటితోపాటు స్పాట్‌లో చికిత్స అందించేందుకు వీలుగా ఆంబులెన్స్‌లు, కాంపా వాహనాలు ఉన్నాయి. హనుమాన్ డిజిటల్ యాప్, అధునాతన సాంకేతికతతో అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం తీసుకువచ్చింది ప్రభుత్వం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe